గురుకులాలు..గాలికే!
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:42 AM
సమస్యల మధ్యే చదువు సా..గుతోంది.. అయినా అటువైపు కన్నెత్తి చూసేవారే లేరు.. కనీసం పట్టించుకునేవారు కానరావడంలేదు.. నిధులు ఏమైనా లేవా అంటే అదీ కాదు.. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మారిపోయింది..
అంబేడ్కర్ గురుకులాల్లో ఘోరం
శానిటేషన్ నిర్వహణ గాలికి
అపరిశుభ్రంగా హాస్టళ్లు
గత వైసీపీలో కాంట్రాక్టు
నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు
వసతిగృహాల ప్రిన్సిపాళ్ల నివేదికలు
ఖాతరు చేయని కాంట్రాక్టు కంపెనీ
మళ్లీ కాంట్రాక్టు పొడిగింపుపై కన్ను
కాకినాడ- ఆంధ్రజ్యోతి)
సమస్యల మధ్యే చదువు సా..గుతోంది.. అయినా అటువైపు కన్నెత్తి చూసేవారే లేరు.. కనీసం పట్టించుకునేవారు కానరావడంలేదు.. నిధులు ఏమైనా లేవా అంటే అదీ కాదు.. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మారిపోయింది.. కోట్లు తీసుకున్నా.. కక్కుర్తి పనులు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.. ఇదీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 21 అంబేడ్కర్ గురుకుల వసతి గృహాల్లో దుస్థితి.. కలుషిత నీళ్లు తాగుతూ.. అపరిశుభ్ర వాతావరణం మధ్య వేలాది మంది విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టు శానిటేషన్ కంపెనీ నిధులు మింగేసి నిర్వహణ గాలికొదిలేయడంతో సమస్యల మధ్యే చదువు సాగిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు సైతం సదరు కంపెనీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తీరు మార్చుకోవడం లేదు. కోట్లాది రూపాయల మేర నిధులిస్తున్నారు.. చుట్టూ పెద్దఎత్తున అధికార యంత్రాంగం ఉం ది. అయితే ఏం లాభం.. కనీసం అక్కడ ఏం జరుగుతుందో చూసే వారే కరువయ్యారు. విద్యార్థులు సమస్యల మధ్యే వసతి పొందు తున్నా పరిష్కరించే నాథులే కరువయ్యారు. ఇదెక్కడో కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల వసతిగృహాల్లో దుస్థితి. ఆ వసతి గృహాల్లో మంచినీటి ట్యాం కులు, ఆర్వో ప్లాంట్లను పరిశుభ్రంగా ఉంచా ల్సిన కాంట్రాక్టర్ గాలి కొదిలేయడంతో విద్యార్థు లకు కలుషిత నీరే దిక్కుగా మారింది. అటు వందల సంఖ్యలో ఉండే విద్యార్థుల హాస్టళ్లలో ఎప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయాల్సి ఉన్నా అదీ చేయడం లేదు. డ్రైనేజీ నిర్వహణ పట్టించు కోవడం లేదు. హాస్టల్ పరిసరాలను గాలికొదిలేశారు. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో టెండరు దక్కించుకున్న తెలం గాణకు చెందిన ఈ కంపెనీ ప్రభుత్వం మారినా అదే అరాచకం కొనసాగిస్తోంది. అటు విద్యా ర్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి లేఖలు రాసినా కాంట్రాక్టర్ ఖాతరు ఏమాత్రం చేయడం లేదు. సదరు బిల్లులు భారీగా బొక్కేస్తూ స్థానికంగా ఓ ఇద్దరు తాత్కా లిక ప్రైవేటు ఉద్యోగులకు హాస్టళ్లను సబ్ కాం ట్రాక్టుకు ఇచ్చేసి తన బాధ్యతను వదిలేశాడు.
13 వేల మంది విద్యార్థులు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 21 చోట్ల అంబేడ్కర్ గురుకుల వసతి గృహాలు ఉన్నాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఎస్సీ విద్యార్థు లకు విద్యాభ్యాసంతోపాటు వసతి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఒక్కో వసతి గృహం లో 640 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 13 వేల మంది ఉంటున్నారు. గురుకులాల్లో పూర్తి పరిశుభ్ర వాతావరణంలో చదు వు,వసతి ఉండే లా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. పారిశుధ్య నిర్వహణకు కాంట్రాక్టర్‌ను నియమించి నెలకు కోట్లలో బిల్లులు చెల్లిస్తోంది. శానిటేషన్ కాం ట్రాక్టు పొందిన కంపెనీ ప్రతి వసతి గృహానికి సిబ్బందిని నియమించి యూనిఫాం ఇచ్చి పను లు చేయించాలి. గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అనుకూలంగా ఉండడంతో ఎక్కడికక్కడ స్థాని కంగా ఓ మనిషిని పురమాయించి వారితో అర కొర పనులు చేయిస్తూ నెట్టుకొచ్చింది. ప్రభు త్వం మారిన తర్వాత కూడా సదరు కంపెనీ అదే నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. వసతి గృహం ఉన్న ప్రాంతంలో ఓ పనిమనిషికి రూ.5 వేల వరకు ఇచ్చి తూతూమంత్రంగా పనులు చేయి స్తోంది. కంపెనీ కోట్లలో దండుకుంటోంది.
విద్యార్థులకు కలుషిత నీరే తాగునీరు..
ఉమ్మడి జిల్లాలో 21 వసతిగృహాల శానిటేషన్ కాంట్రాక్టును గత వైసీపీ ప్రభుత్వం తన అనుకూలంగా ఉండే తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కృష్ణ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి 2023లో ఇచ్చింది. సదరు కంపెనీ కొద్దినెలలు మినహా ఆ తర్వాత పారిశుధ్య నిర్వహణ గాలికొదిలేసింది. నిబంధనల ప్రకారం ఈ కంపెనీ ఆయా హాస్టళ్లలో సిబ్బం దిని నియమించుకుని పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి. మూ డు నెలలకోసారి ఓవర్‌హెడ్ ట్యాంకులు శుభ్రం చేసి మం చినీరందించాలి. అయితే ఏడాదిన్నరగా పూర్తిగా గాలికొది లేసింది. హాస్టళ్లలో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. దీంతో విద్యార్థులు కలుషిత నీటినే తాగుతున్నారు. కొన్నిచోట్ల ఇవి పాడైపోవ డంతో బోరు నీరు తాగాల్సిన పరిస్థితి. వేలాది మంది విద్యా ర్థులు ఉండే హాస్టళ్లలో సెప్టిక్ ట్యాంకులను తరచూ శుభ్రం చేయించాలి.కానీ ఏడాదిన్నరగా పట్టించుకోవడం మానేసింది. దీంతో విద్యార్థులు దుర్వాసన మధ్యే వసతి పొందాల్సి వస్తోం ది. హాస్టళ్లలో డ్రైనేజీ, ఇతర కాలువల్లో వ్యర్థాలు, ఇతర ఆహారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నా సదరు కంపెనీ పట్టించుకోవడం లేదు. హాస్టళ్లన్నీ అపరిశుభ్ర వాతా వరణంలో ఉంటున్నాయి. కానీ నెలనెలా మాత్రం ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బిల్లులు దండేసుకుంటోంది.
నలుగురు ఎమ్మెల్యేలు చెప్పినా..
ఉమ్మడి జిల్లాలో అంబేద్కర్ గురుకుల వసతిగృహాల్లో శానిటేషన్ కంపెనీ నిర్లక్ష్యంపై ఆయా ప్రిన్సిపాళ్లు ఇప్పటికే ఉన్నతాధికారు లకు నివేదికలు పంపించారు. ప్రభుత్వం మారినా కంపెనీ వైఖరి ఏమాత్రం మార లేదని నివేదికలో వివరించారు. మొత్తం 15 అంశాల్లో కంపెనీ కనీసం ఆరు అంశాల్లో కూడా పారిశుధ్య నిర్వహణ పాటించడం లేదని రిమార్కులతో నివేదికలు పంపారు. వీటిని పరిశీలించి సరిదిద్దాల్సిన జిల్లా కోఆర్డినేటర్ సైతం కంపెనీపై చర్యలు తీసుకునేలా పైఅధికారులకు సిఫార్సులు చేయలేదు. మరోపక్క ఈ వసతి గృహాల్లో శానిటేషన్ ఘోరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కొంతకాలం కిందట స్థానిక ఎమ్మెల్యేలకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో నలుగురు ఎమ్మెల్యేలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి నేరుగా లేఖలో ఫిర్యాదు చేశారు. అయినా కంపెనీ మాత్రం తన తీరు మార్చుకోలేదు.
గతేడాదే గడువు ముగిసినా..
గతేడాదే ఈ కంపెనీకి టెండరు గడువు పూర్త యింది. కానీ గత వైసీపీ పెద్దలు మాత్రం పనితీరు ఏమాత్రం బాగోలేని కంపెనీకి దాసో హమయ్యారు. తిరిగి మరో ఏడాది కాంట్రాక్టు పొడిగిస్తూ గతేడాది అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇప్పటికీ ఈ సంస్థ సేవలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. అధికారులు సైతం రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో కంపెనీ నిర్లక్ష్యపు సేవలపై కనీసం సమీక్షించలేదు. మరోపక్క గురుకుల వసతి గృహాల్లో అప్పనంగా కోట్లలో డబ్బు బిల్లులు రూపంలో వస్తుండడంతో త్వరలో ముగిసి పోనున్న కాంట్రాక్టును మళ్లీ పొడిగించేందుకు సదరు కంపెనీ రాజకీయంగా పావులు కదుపు తోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచినా మళ్లీ తామే కొనసాగేలా తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది.