Share News

బాణసంచా గొడౌన్‌లో పేలుడు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:04 AM

కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలోని బాణసంచా గొ డౌన్‌లో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న కొవ్వూరు అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

బాణసంచా గొడౌన్‌లో పేలుడు
ప్రమాదంలో ధ్వంసమైన బాణసంచా గొడౌన్‌

  • పంగిడిలో ఘటన

  • తప్పిన ప్రాణాపాయం

  • ప్రమాదంలో ధ్వంసమైన గొడౌన్‌

  • రూ.3 లక్షల ఆస్తి నష్టం

  • ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

కొవ్వూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలోని బాణసంచా గొ డౌన్‌లో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న కొవ్వూరు అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు గుర్తించారు. గొడౌన్‌లో బాణసంచా తయారు చేసేందుకు సూర్యకారం, గంధకం, బొగ్గు నిలువచేసి ఉం చారు. అలాగే 150 జువ్వలు, 50 ఔట్లు, 4000 టపాకాయలు, సుమారు 15 కిలోలు తయారు చేసినవి, రా మెటీరియల్‌ 15 కిలోలు మొత్తం 30 కేజీల ఫైర్‌ మెటీరియల్‌ గొడౌన్‌లో ఉన్నాయి. ఒకవైపు ఎండ వేడిమి, మరో వైపు గొడౌన్‌ తలుపులు మూసేసి ఉండడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

భద్రతా ప్రమాణాలు పాటించాలి : కలెక్టర్‌

కొవ్వూరు మండలం ఐ.పంగిడి, చాగల్లు మండ లం మీనానగరం గ్రామాల మధ్యలో ఉన్న నఫీజ్‌ బాణసంచా గొడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా తయారీ యూనిట్‌లను పరిశీలించి తగిన భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీదారులు లైసెన్సుల కాలపరిమితి ముగిసిన వారిని గుర్తించి రెన్యూవల్‌ అనుమతులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాణసంచా భద్రపరిచే గొడౌన్‌ల వద్ద తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. పంగిడిలో నసీఫ్‌ ఫైర్‌ క్రాకర్స్‌కు ఇచ్చిన అనుమతి మార్చి 31వ తేదీతో ముగిసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణసంచా భద్రపరిచే గొడౌన్‌లని పోలీసు, రెవెన్యూ, ఫైర్‌, స్థానిక సంస్థల అధికారుల బృందం పర్యవేక్షించి లైసెన్సులు లేకపోయినా, తగిన భద్రతా ప్రమాణాలు పాటించక పోయిన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌ఎఫ్‌వో ఈ.స్వామి, డీఎఫ్‌వో మార్టిన్‌ లూధర్‌కింగ్‌, ఆర్డీవో రాణి సుస్మిత, తహశీల్దార్‌ ఎం.దుర్గాప్రసాద్‌, కొవ్వూరు రూరల్‌ సీఐ కె.విజయబాబు, ఫైర్‌ అధికారి ఏవీఎస్‌ఎన్‌ఎస్‌ వేణు, ఎస్‌ఐ కె.శ్రీహరిరావు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:04 AM