Share News

కోనసీమకు విద్యుత్‌ శాపం

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:44 AM

కోనసీమ జిల్లాకు మూడు రోజుల నుంచి కరెంటు శాపంలా మారింది. గత మంగళవారం రాత్రి కోటిపల్లిలో 132 కేవీ టవర్‌ కూలిపోవడంతో మూడు రోజుల నుంచి కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లోని ప్రజలు రాత్రి సమయంలో చీకటిలో గడుపుతున్నారు.

కోనసీమకు విద్యుత్‌ శాపం

మలికిపురం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాకు మూడు రోజుల నుంచి కరెంటు శాపంలా మారింది. గత మంగళవారం రాత్రి కోటిపల్లిలో 132 కేవీ టవర్‌ కూలిపోవడంతో మూడు రోజుల నుంచి కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లోని ప్రజలు రాత్రి సమయంలో చీకటిలో గడుపుతున్నారు. అధికారులకు ముందుచూపు లేకపోవడం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. సరిపడా విద్యుత్‌ ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముమ్మిడివరం, కొత్తపేట, అమలాపురం, రాజోలు నియోజకవర్గాలకు 200 మెగా వాట్ల విద్యుత్‌ అవసరం ఉంది. కోటిపల్లి టవర్‌ కూలడంతో ఉండి 220 కేవీ, భీమవరం 132 కేవీల నుంచి ఈ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా కొనసాగించారు. అయితే 200 మెగా వాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా 106 మెగా వాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రెండు స బ్‌స్టేషన్ల నుంచి సరిపడా విద్యుత్‌ను పంపితే కాలం చెల్లిన విద్యుత్‌ తీగలు తెగిపోయే అవకాశం ఉండడంతో 130 మెగావాట్లతో సరిపెట్టారు. మిగిలిన లోటు విద్యుత్‌ను ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ పేరుతో ప్రతీ రెండు గంటలకు నిలిపి వేస్తున్నారు. విద్యుత్‌ ఉన్నతాధికారులు ఇటువంటి యాంగిల్‌ టవర్‌ ఉన్నచోట నిరంతరం పర్యవేక్షణతో కాపాడాలని, లేకపోతే ఇటువంటి సమస్యలు తప్పవని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటువంటి సమస్యలు ఏర్పడతాయనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పద్ధతులను కూడా అమలుచేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ సర్క్యూట్‌ ఏర్పాట్లకు ఆలోచన చేయడం లేదు. కోనసీమలో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన ఈ యాంగిల్‌ టవర్లన్నీ పాడు పడే స్థితికి వచ్చాయని, ప్రతీ సబ్‌స్టేషన్‌కు ఒక లైను నుంచి అంతరాయం ఏర్పడితే మరో లైను నుంచి వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించే పద్ధతిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. గత మంగళవారం నుంచి విద్యుత్‌ సరఫరా లేక ఆక్వా రైతులు డీజిల్‌ కొనలేక ఇబ్బందులు పడ్డారు. ఇన్వర్టర్లు లేని జనం పడిన పాట్లు వర్ణనాతీతం.

Updated Date - Apr 18 , 2025 | 01:44 AM