భూమిపై జీవ వైవిధ్య వనరులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:09 AM
వాతావరణ నియంత్రణను, జీవ వైవిధ్యాన్ని, అవసరమైన వనరులను భూమి మనకు అందిస్తోందని ఆదాయపు పన్ను శాఖ అడిషనల్ కమిషనర్ ఎం.మోహనబాబు అన్నారు.
ఆదాయపు పన్నుశాఖ అడిషనల్ కమిషనర్ మోహన్‌బాబు
ఘనంగా నన్నయ వర్శిటీ ఆవిర్భావ వేడుకలు, ధరిత్రీ దినోత్సవం
దివాన్‌చెరువు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): వాతావరణ నియంత్రణను, జీవ వైవిధ్యాన్ని, అవసరమైన వనరులను భూమి మనకు అందిస్తోందని ఆదాయపు పన్ను శాఖ అడిషనల్ కమిషనర్ ఎం.మోహనబాబు అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ వేడుకలు, ధరిత్రి దినోత్సవాన్ని మంగళవారం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మోహన్‌బాబు మాట్లాడుతూ వాతావరణ మార్పు, అటవీ నిర్మూలన, కాలుష్యం జీవవైవిధ్య నష్టానికి దారితీశాయన్నారు. ఏటా 2.01 బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయని, 13 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం పోతోందని తెలిపారు. మానవ కార్యకలాపాల వల్ల ఒక మిలియన్ జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. మానవులంతా పర్యావరణ హితంగా జీవించాలని కోరారు.
నిరంతర పర్యవేక్షణ: వీసీ
వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని శక్తివంతమైన విద్యార్థి కేంద్రీకృత విజ్ఞాన కేంద్రంగా మార్చుతామన్నారు. అన్ని అనుబంధ కళాశాలలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. భవిష్యత్‌లో విశ్వవిద్యాలయం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ తనిఖీల ద్వారా కళాశాలల విద్యా పనితీరు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామన్నారు. కళాశాల ఉత్తమ అభ్యాసాలను ప్రశంసిస్తామని, ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోడల్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఎదగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లును అందజేశారు. అంతకు ముందు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.
‘నన్నయ’లో సన్ డయల్
నన్నయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఫిజిక్స్ విభాగం విద్యార్థులు సూర్యుడి గమనం ద్వారా సమయాన్ని తెలిపే సన్ డయల్‌ను నిర్మించారు. దీనిని వీసీ ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలల్లో తొలిసారి సన్‌డయల్ నన్నయ వర్శిటీలోనే ఏర్పాటు చేశామన్నారు. ఇది ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకూ సమయాన్ని సూచిస్తుందని చెప్పారు. అన్నవరం, ద్రాక్షారామంలో ఇది ఉందని చెప్పారు.