ఈనెలాఖరుతో ముగుస్తున్న ఈకేవైసీ గడువు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:25 AM
రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు.
అమలాపురం, ఏప్రిల్26(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అడపా ఉదయభాస్కర్ తెలిపారు. లబ్ధిదారులను ఎలక్ర్టానిక్ పద్ధతిలో గుర్తించేందుకు వీలుగా ఈ ప్రక్రియ అమలులో ఉందని, రేషన్‌కార్డులో పేరు కలిగిన ప్రతీ ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేసుకుని నిరంతరాయంగా ప్రభుత్వ ప థకాల లబ్ధిని, సంక్షేమ పథకాలను పొం దాలని సూచించారు. రేషన్ షాపులు, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ ఆపరేటర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయాల్లో ఈకేవైసీ చేయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఐదేళ్లలోపు పిల్లల నుంచి 80 ఏళ్లలోపు వయసు దాటిన వారికి ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉందన్నారు. రేషన్‌కార్డుల ఈకేవైసీకీ గడువు నాలుగు రోజులు మాత్రమే ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే సంక్షేమ పథకాల అర్హుల జాబితా గుర్తించవచ్చునన్నారు. వేలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండడం, పరీక్షల వల్ల వారంతా ఈకేవైసీ పూర్తిచేసుకోలేకపోయారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పొడిగించిందని చెప్పారు. ఇటీవలకాలంలో అనేక మంది రేషన్‌కార్డుదారులు చనిపోయారని, వారి పేర్లను తొలగించలేదని, చాలా మంది చిరునామాలు మారిపోయాయని దీంతో అవన్నీ ఈకేవైసీ జరగలేదన్నారు. చిరునామా మారినప్పటికీ రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడే చేయించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ పాస్ యంత్రాల్లో పెండింగ్ ఉందని గమనిస్తే సభ్యున్ని పిలిచి వేలిముద్రలు వేయిస్తున్నారని, పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవారు, విదేశాల్లో చదువుకుంటున్నవారి కోసం ఇప్పటిదాకా అవకాశం ఇచ్చామన్నారు. 2020లో కార్డులు పొందినవారి పిల్లల వయసు పదేళ్లు ఉంటుందని, వారంతా ఆధార్ బయోమెట్రిక్ చేసుకోవాలన్నారు.