Share News

నోరూరే..ఊరుగాయ!

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:19 AM

గోదారోళ్ల పచ్చళ్లు అంటే నోరూరాల్సిందే.. ఆ టేస్టే వేరు.. ఆ టేస్టే వేరు.. ఒకసారి తిన్నారా.. వదిలిపెట్టరు.. మళ్లీ మళ్లీ నోరూరిస్తోంది.. చూసిన వెంటనే లొట్టలేస్తారు.. అందుకే 60 ఏళ్లు అవుతున్నా ఆ ఊరి పచ్చడికి నేటికీ డిమాండ్‌ తగ్గలేదు..

నోరూరే..ఊరుగాయ!
గోదారోళ్ల ఆవకాయ పచ్చడి

నాణ్యతకు పెట్టింది పేరు

ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌

పట్టణాలకు ఎగుమతులు

సీజన్‌కు తగినట్టు పచ్చళ్లు

ఆ ఊరుకు అదే ఆధారం

(ఆత్రేయపురం -ఆంధ్రజ్యోతి)

గోదారోళ్ల పచ్చళ్లు అంటే నోరూరాల్సిందే.. ఆ టేస్టే వేరు.. ఆ టేస్టే వేరు.. ఒకసారి తిన్నారా.. వదిలిపెట్టరు.. మళ్లీ మళ్లీ నోరూరిస్తోంది.. చూసిన వెంటనే లొట్టలేస్తారు.. అందుకే 60 ఏళ్లు అవుతున్నా ఆ ఊరి పచ్చడికి నేటికీ డిమాండ్‌ తగ్గలేదు..ఎన్ని కంపెనీలు వచ్చినా ఆ ఊరు ఊరగాయకు ఏ మాత్రం డిమాండ్‌ తగ్గలేదు.. అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. ఇంటికో పచ్చళ్ల పరిశ్రమ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో.. ఊళ్లో 1156 కుటుంబాలు ఉంటే 800 కుటుంబాలకు అదే ఆధారం. ఒకసారి పచ్చళ్ల పల్లెటూరు నార్కెడిమిల్లిని చూసొద్దామా.. ఎక్కడో మారుమూల పల్లెటూరు.. పరిసర గ్రామాల ప్రజలకు పేరు చెప్పినా అదెక్కడ అంటూ ఆలోచిస్తారు.. అయితే దేశవిదేశాల్లో మాత్రం చాలా పెద్ద ఫేమస్‌.. ఎందుకంటే ఆ ఊరు పచ్చళ్లకు అంత డిమాండ్‌.. పూతరేకులకు ఆత్రేయపురం ఫేమస్‌ అయితే ఊరగాయలకు నార్కెడిమిల్లి ఫేమస్‌.. ఆ గ్రామంలో అడుగుపెట్టగానే ఏ ఇంట చూసిన పచ్చళ్ల డ్రమ్ములు.. బస్తాల్లో ముడి సరుకు.. నోరూరించే పచ్చళ్ల సువాసనలు వెదజల్లుతుంటాయి. వశిష్ఠ గోదావరి చెంతనే ఉన్న గ్రామం పచ్చళ్లకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. సుమారు ఆరు దశాబ్దాల కిందట నుంచే ఇక్కడ పచ్చళ్లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇళ్ల వద్దే కుటీర పరిశ్రమగా స్థాపించి అన్ని రకాల పచ్చళ్లు సీజన్‌ వారీగా నిత్యం తయారుచేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడ తయారైన పచ్చళ్లు దేశంలో వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్లి విక్రస్తుంటారు.

60 ఏళ్లుగా అదే వ్యాపారం..

ఆరు దశాబ్దాల కిందట పచ్చళ్ల తయారీ వెలసింది. నాడు సరదాగా ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం నేడు ప్రతి ఇంటికీ ఉపాధిగా మారింది. ఆ ఊరులో ఏ ఇంటి ఎదుట చూసినా పచ్చళ్ల డ్రమ్ములు కనిపిస్తూనే ఉంటాయి. పచ్చళ్లలో ఎటువంటి రంగులు, రసాయనాలు లేకుండా తయారుచేయడం ప్రత్యేకత. కారం, ఉప్పు, ఇతర సామగ్రి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసుకుని ఎండబెట్టి శుభ్రం చేసి ఎంతో శ్రద్ధగా నాణ్యత ప్రమాణాలతో పచ్చళ్లను తయారు చేస్తారు. అందుకే 60 ఏళ్లయినా నేటికీ నోరూరుతూనే ఉన్నాయి ఆ ఊరి పచ్చళ్లు.. తయారు చేసిన పచ్చళ్లను డ్రమ్ముల్లో నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ వ్యాపారులు సైకిళ్లు, బైక్‌లు ద్వారా ఇంటింటికి వెళ్లి అమ్మకాలు సాగిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో హోటల్స్‌కు కిలో రూ.150 నుంచి రూ.250 వరకు హోల్‌సేల్‌గా అందిస్తారు.

నార్కెడిమిల్లి టూ..

నార్కెడిమిల్లిలో ఆడవాళ్లు ఏడాది పొడవునా సీజనల్‌ పచ్చళ్లను తయారు చేస్తుంటారు. ఆవకాయ, మావగాయ, నిమ్మకాయ, టమాటా, పండుమిర్చి, ఉసిరి, కాకరకాయ, అల్లం, చింతకాయ, దబ్బకాయ, బెల్లం ఆవకాయ, కరివేపాకు, గోంగూర, కారంపొడులను తయారు చేస్తుంటారు. మగవారంతా ఆ పచ్చళ్లను బెంగళూరు, చెన్నై, ఒడిషా, ముంబై, హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌, రాయలసీమ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి విక్రస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా వీరికిద్దే జీవనాధారం. గ్రామంలోని మగవాళ్లంతా ఈ పచ్చళ్లతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు సాగిస్తారు. పండుగలు, ఎన్నికలు, శుభకార్యాలకు మాత్రమే గ్రామాలకు వస్తారు.

ట్యాక్స్‌

మినహాయించాలి

నార్కెడిమిల్లి పచ్చళ్లను వివిధ రాష్ర్టాలకు తరలిస్తుంటాం. మధ్యలో సేల్స్‌ట్యాక్స్‌ అధికారులు వేబిల్లులు పేరుతో ఇబ్బందులు కల్పిస్తున్నారు. సేల్స్‌ ట్యాక్స్‌ నుంచి విముక్తి కల్పించాలి.

- కొపెల్ల శ్రీరామ్‌, వ్యాపారి

రాయితీ రుణాలివ్వాలి..

చాలా ఏళ్లుగా పచ్చళ్ల తయారీ జీవనాధారం. మాకు ముడి సరుకు కొను గోలుకు రాయితీ రుణాలిస్తే మేమేంటో చూపిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రుణాలు అందించి పరిశ్రమను ఆదుకోవాలి.

- మోటారి షామిలి

Updated Date - Apr 27 , 2025 | 01:19 AM