Share News

నిబంధనల ట్రాక్‌ తప్పారు!

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:35 AM

ప్రమాదాలు చెప్పిరావు.. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఎవరి జాగ్రత్తలో వాళ్లుండాల్సిందే.. లేదంటే ప్రమాదం తప్పదు..

నిబంధనల ట్రాక్‌ తప్పారు!
రైలు కోచ్‌ రెస్టారెంట్‌

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

ప్రమాదాలు చెప్పిరావు.. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఎవరి జాగ్రత్తలో వాళ్లుండాల్సిందే.. లేదంటే ప్రమాదం తప్పదు.. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషను ప్రాంగణంలోని రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌ నిబంధనల ట్రాక్‌ తప్పుతూనే ఉంది. అధికారులు అటుగా చూడకపోవడంతో ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు వ్యాపారంపై ఉన్న యావ భద్రతపై ఉండడం లేదు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వాటిపై కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌లో అగ్ని మాపక పరికరాలు లేవు. రైలు బోగీకి రంగులు వేసి, లోపల ఫ్లైవుడ్‌, కుషన్‌ సీట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ అగ్గికి ఆజ్యం వంటివే. ఒక్కసారి నిప్పు రేగితే వేగంగా బుగ్గి అయిపోతాయి. పైగా తప్పించుకొనే (ఎస్కేపింగ్‌ వే) మార్గాలను సూచించలేదు. ఒక ఫైర్‌ ఎస్టింగిషర్‌ (మంటలు ఆర్పే గ్యాస్‌ ఉన్న చిన్న సిలిండర్‌)ని జనాలను ఏమార్చడానికి కోచ్‌ బయట పడేశారు. అది కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయింది. రెస్టారెంట్‌లో వంటలకు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారు. ఇది చట్ట రీత్యా నేరం. పైగా దానిని వేడి నీటిలో పెట్టి మరీ వినియోగిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితేనే కానీ పట్టదా సార్‌.. ఒకసారి అటు చూడండి మరి..

Updated Date - Apr 17 , 2025 | 12:35 AM