Share News

గురుకుల పాఠశాలలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:42 AM

ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనలపై అమలాపురం ఆర్డీవో కె.మాధవి గురువారం సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గురుకుల పాఠశాలలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ

ముమ్మిడివరం,ఏప్రిల్‌17(ఆంధ్రజ్యోతి): ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనలపై అమలాపురం ఆర్డీవో కె.మాధవి గురువారం సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో నిల్వ సరుకులతో వంట చేసేందుకు ప్రయత్నించగా పేరెంట్స్‌ కమిటీ సభ్యులు అడ్డుకోవడం.. రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కిరణ్‌ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం, వంటశాలపరిశీలించి అక్కడ పారవేసిన పుచ్చిన వంకాయలు, బెండకాయలు, ఆనబకాయలను గుర్తించడం, ఈ వ్యవహారంపై ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ సుబ్బారావు, డీసీవో శైలజలకు ఫిర్యాదు అందడం, దానిపై వారు బుధవారం గురుకుల పాఠశాలను సందర్శించి స్టోర్‌ రూములో నిల్వ రాగిపిండి ప్యాకెట్‌ను గుర్తించి వాటిని సీజ్‌ చేసిన విషయం విదితమే. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అమలాపురం ఆర్డీవో కె.మాధవి, నగర పంచాయతీ కమిషనర్‌ పి.రవివర్మలతో కలిసి గురువారం గురుకుల పాఠశాలను సందర్శించి విచారించారు. పేరెంట్స్‌ కమిటీ సభ్యుల నుంచి అక్కడ జరుగుతున్న అవకతవకలపై సమాచారం సేకరించారు. ప్రిన్సిపాల్‌ టి.గంగాభవానీ అధ్యాపకులు, సిబ్బందిని ఆమె విచారించారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులు, వసతి, వంటగదులను ఆమె పరిశీలించారు. స్టోర్‌రూములో పాడైన చింతపండు, ఇతర వంటసరుకులు ఉండడాన్ని గుర్తించి వాటిని పడేయాలని, బాత్‌రూములు అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించి వాటి శుభ్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలుకలు కరిచిన విద్యార్థినులను పరామర్శించి, వారికి వైద్యసేవలు అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె మీడియాకు వెల్లడించారు. ఆమె వెంట ముమ్మిడివరం తహశీల్దార్‌ ఎంవీ సుబ్బలక్ష్మి, ఎంపీడీవో తాడి శ్రీవెంకటాచార్య ఉన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 01:42 AM