Share News

గుడిమెళ్లంక రిజర్వాయర్‌ సమస్యలు పరిష్కరిస్తా

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:24 AM

రాజోలు నియోజకవర్గంలో అత్యంత కీలకమైన గుడిమెళ్లంక రక్షిత మంచినీటి పథకం బాలరిష్టాలను వెంటనే పరిష్కరిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు.

గుడిమెళ్లంక రిజర్వాయర్‌ సమస్యలు పరిష్కరిస్తా

మలికిపురం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాజోలు నియోజకవర్గంలో అత్యంత కీలకమైన గుడిమెళ్లంక రక్షిత మంచినీటి పథకం బాలరిష్టాలను వెంటనే పరిష్కరిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు. గుడిమెళ్లంక రిజర్వాయర్‌ వద్ద విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 98 హేబిటేషన్లకు ఈరిజర్వాయరు ద్వారా రోజూ 70లక్షల లీటర్ల తాగునీటిని అందిస్తున్నామన్నారు. ఈరిజర్వాయరుకు 510 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అవసరముందని, ప్రస్తుతం 350కేవీ విద్యుత్‌ను వాడుకుంటున్నారని, అదనంగా 160 కేవీ కోసం సమావేశం నుంచే విద్యుత్‌ ఎస్‌ఈ రాజబాబుతో మాట్లాడారు. 24గంటలు విద్యుత్‌ సరఫరా చేసే ప్రత్యేక లైన్‌ పనులు మూడు రోజుల్లో పూర్తి కానున్నట్టు ఆయన చెప్పారు. మలికిపురం నుంచి ప్రత్యేక లైన్‌ ద్వారా విద్యుత్‌ను అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 26 కొత్త మంచీనటి ట్యాంకులు నిర్మించామన్నారు. ఓఎన్జీసీ నుంచి రూ.5కోట్లు సీఎస్సార్‌ నిధుల నుంచి మంజూరు చేయమని అడిగామని, ఆ నిధులు మంజూరైతే మరో ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఒక ఆర్‌ఎస్‌ఎఫ్‌, మైక్రో ఫిల్టర్ల ద్వారా నీరు అందిస్తున్నామనారు. వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా రిజర్వాయరులో ఏడు మీటర్ల నీటిని నిల్వ చేశామన్నారు. త్వరలో ఈ సమస్యలను అధిగమించి సక్రమంగా తాగునీరు అందడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జేజేఎం ద్వారా నియోజకవర్గంలో 60గ్రామాల్లో కుళాయిలు వేయాల్సి ఉండగా 28గ్రామాల్లో పూర్తయ్యాయని, 32గ్రామాల్లో వేయాల్సి ఉందన్నారు. త్వరలో రిజర్వాయరును కూడా ఆధునికీకరస్తామన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈఈ రాజన్‌ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. గ్రామాల్లో పంచాయతీలు, తాగునీటి సరఫరాలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ కనెక్షన్లు తీసి వేయడానికి పంచాయతీల ద్వారా నోటీసులిస్తామన్నారు. ఎలక్ర్టికల్‌ విద్యుత్‌ ఏడీఈ శ్రీనివాస్‌ మాట్లాడుతూ గుడిమెళ్లంక రిజర్వాయరుకు విద్యుత్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి మరో 160 కేవీ విద్యుత్‌ సరఫరాకు ముందుకు వెళతామన్నారు. సమావేశంలో దిరిశాల బాలాజీ, చాగంటి స్వామి, చెల్లుబోయిన హెలీనలు పలు సమస్యలపై మాట్లాడారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌, ఎంపీపీ ఎంవీ సత్యవాణి, బాలాజీ, చాగంటి స్వామి, అడబాల యుగంధర్‌, చెల్లింగి సత్యనారాయణ, రాపాక నవరత్నం, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:24 AM