Share News

స్టాకు యార్డుల్లో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలి

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:39 AM

వర్షాకాలంలో సైతం భవన నిర్మాణరంగంలో నిరంతరాయంగా పనులు కొనసాగించేలా స్టాకుయార్డుల్లో 20లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఉచిత ఇసుక పాలసీని అమలుచేయాలన్నారు.

స్టాకు యార్డుల్లో 20 లక్షల మెట్రిక్‌               టన్నుల ఇసుక                   నిల్వ చేయాలి

అమలాపురం, ఏప్రిల్‌17(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో సైతం భవన నిర్మాణరంగంలో నిరంతరాయంగా పనులు కొనసాగించేలా స్టాకుయార్డుల్లో 20లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఉచిత ఇసుక పాలసీని అమలుచేయాలన్నారు. మాన్యువల్‌ సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లలో ఉన్న ఇసుక తవ్వకాలను మే, జూన్‌ మాసాల్లో ముమ్మరంచేసి స్టాకు యార్డులకు రోజువారీ లక్ష్యాలతో ఇసుకను తరలించి నిల్వ చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సూ క్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ ఎంఈ) పార్కుల ఏర్పాటుకు జిల్లాలోని ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేశామన్నారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక చేయాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రధానంగా ఉచిత ఇసుక పాలసీ విధానం, సౌరశక్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు భూసేకరణ, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. తర్వాత కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధికారులను ఉద్ధేశించి మాట్లాడారు. కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లకు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ అనుమతులు వారం రోజుల్లో పొందుతూ తవ్వకాలు వేగవంతం చేయాలన్నారు. సౌరశక్తి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములు, పట్టా భూములను డిసెంబరు నాటికి ఎంపిక చేయాలన్నారు. ఆయా స్థలాలను నెడ్‌క్యాప్‌ వారికి అప్పగించాలన్నారు. పంటకాల్వలు మూసివేసేలోగా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నూరుశాతం నింపుకుని వేసవిలో సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీలో అసభ్య ప్రవర్తనకు తావు లేకుండా లబ్ధిదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఆసుపత్రి సేవల నిర్వహణ పట్ల ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజా సంతృప్తి స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనావేసి జిల్లాలకు గ్రేడింగ్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం ఎంపికచేసిన స్థలాలకు రాకపోకలకు అనువైన వసతులు పరిపూర్ణంగా ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మూడో శనివారం ఈనెల 19న నిర్వహిస్తూ ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలు (ఈవేస్ట్‌) రీసైక్లింగ్‌ ఇతివృత్తంతో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు. సమావేశంలో డీపీవో డి.శాంతలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్లు వీఐపీ నాయకుడు, కేవీఆర్‌ఆర్‌ రాజు, భూగర్భశాఖ ఏడీ ఎల్‌.వంశీధర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ డివిజనల్‌ఇంజనీర్‌ పద్మనాభం, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ వీకేపీ ప్రసాద్‌, డీఐపీఆర్వో కె.లక్ష్మీనారాయణ, టెక్నికల్‌ కోఆర్డినేటర్‌ సువిజయ్‌, రియాల్టీ ఇనస్పెక్టర్‌ పి.సుజాత పాల్గొన్నారు.

మే 1 నుంచి తవ్వకాలు నిర్వహించాలి

జిల్లాలో ఐదు సెమీమెకనైజ్డ్‌ ఇసుక రీచ్‌లలో మే 1 నుంచి తవ్వకాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ జిల్లా ఇసుక కమిటీ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్‌లో మహేష్‌కుమార్‌ అధ్యక్షతన గురువా రం జిల్లా ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గోపాలపురం, జొన్నాడ, అమలాపురం, రావులపాడులలో కొత్తగా ఇసుక స్టాకు డిపోలను గుర్తించి ఆమోదించామని చెప్పారు.

Updated Date - Apr 18 , 2025 | 01:39 AM