ఏ రైలూ..ఖాళీ లేదు..!
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:41 AM
వేసవి సెలవులు వచ్చేశాయి. ఏడాది అంతా చదువులతో కుస్తీ పట్టే పిల్లలు.. ఇంటి పట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూసుకొనే గృ హిణులు.. ఉదయం ఆఫీస్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరే ఉద్యోగులు.. కాస్త సేదతీరాలనుకొనే రోజులు ఏప్రిల్, మే నెలలు..
వేసవికి విహార యాత్ర ఎలా?
తిరుపతికి డబుల్ డెక్కరే గతి
బెంగళూరు..చెన్నైకి ఖాళీల్లేవ్
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వేసవి సెలవులు వచ్చేశాయి. ఏడాది అంతా చదువులతో కుస్తీ పట్టే పిల్లలు.. ఇంటి పట్టునే ఉంటూ కుటుంబం బాగోగులు చూసుకొనే గృ హిణులు.. ఉదయం ఆఫీస్‌కి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరే ఉద్యోగులు.. కాస్త సేదతీరాలనుకొనే రోజులు ఏప్రిల్, మే నెలలు.. ఏడాదిలోని మిగ తా నెలల్లో పిల్లలకు స్కూలు ఉండడంతో ఎక్క డికైనా వెనకడుగు వేస్తారు. వేసవిలో పిల్లలకు స్కూళ్లు సెలవులు ఇస్తారు కాబట్టి.. అలా ఎక్క డికైనా విహారయాత్రకు వెళదామని ప్లాన్ చేసు కుంటారు. ఏ టూర్‌లో అయినా రైలు ప్రయా ణమే కీలకం. రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు చేయించుకుంటే ఫర్వాలేదు. ఇప్పటికిప్పుడు బయలుదేరితే మాత్రం కష్టమే. రైళ్లలో ఇప్పటికే మే నెలాఖరు వరకూ స్లీపర్‌తోపాటు ఏసీ క్లాసు ల రిజర్వేషన్లు నిండుకున్నాయి. వెయిటింగ్ లిస్టులోకి ఎప్పుడో వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఏ రైలు చూసినా కిక్కిరిసి కనిపిస్తోంది.
ఫ సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లు నడిచే తేదీలను పొడిగించడం మినహా చెప్పుకోగ్గ స్థాయిలో ఈ ప్రాంతం వాళ్లకు ఈ వేసవి ప్రత్యేక రైళ్ల విషయంలో ఆ శాఖ దయ చూపలేదు. హైదరాబాద్‌కి వందే భారత్‌లు నడుస్తున్నా చార్జీలు సామాన్యుడు భరించలేనంతగా ఉన్న విషయం తెలిసిందే.
ఫ వేసవిలో ముఖ్యంగా తిరుపతికి రద్దీ ఉం టుంది. కానీ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ వెయిటింగ్ లిస్టు 100కి చేరగా, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లే లేవు. దిబ్రూగఢ్, సంత్రాగచి, హౌరా నుంచి వచ్చే రైళ్లలో రిజర్వేషన్లు క్లోజ్ అయి పోయాయి. వారంలో మూడు రోజులు నడి చే డబుల్ డెక్కర్‌కి కొన్ని టికెట్లు అందుబా టులో ఉన్నాయి. ఈ రైలుకు మినహా ఏ రైలుకూ తిరుపతికి రిజర్వేషన్లు ఖాళీ లేవు.
ఫ బెంగళూరు వెళ్లే వారికి ఇటు నుంచి అటు నుంచి సరైన రైళ్లు లేవు. హతియా- హౌరా -న్యూతిన్సూకియా, టాటా, భువనేశ్వర్ నుం చి వచ్చే రైళ్లు రాజమండ్రి గుండా వెళుతు న్నాయి. అమృత్ భారత్ సోమవారం ఇటు నుంచి మంగళవారం అటు నుంచి ఉంది. కాకినాడ నుంచి బెంగళూరుకు ఉన్న శేషాద్రి మాత్రమే ఈ ప్రాంతం వాళ్లకు దిక్కు. భువ నేశ్వర్ నుంచి వచ్చే హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాజమండ్రి వస్తుంది. ఈ రైలుకి 20 రోజులు ముందు టికెట్ చేయించుకుంటే రూ.2వేలు అవుతుంది. ముజఫర్‌పూర్, న్యూ తి న్సూకియా, భువనేశ్వర్ నుంచి వారానికో సారి, గువాహటి నుంచి వారానికి మూడు సార్లు రైళ్లున్నా బోగీల్లో కాలుపెట్టలేం.
ఫ చెన్నైకి టాటా, ధన్‌బాద్, పురూలియా, న్యూ తిన్సూకియా, షాలిమార్(కోరమాండల్), హౌరా, భువనేశ్వర్ నుంచి రైళ్లు ఉన్నాయి. హౌరా- కన్యాకుమారి, భువనేశ్వర్-పుదుచ్చేరి, ముజఫర్ పూర్-జోలార్‌పెట్టై వరకూ వారా నికోసారి, సిల్చార్- కోయంబత్తూరు, భువనే శ్వర్-చెన్నై, జసిధ్-తాంబరం(గురు), ఖరగ్ పూర్-విల్లుపురం, భువనేశ్వర్-రామేశ్వరం, విశాఖ-చెన్నై (శుక్ర), హౌరా -తిరుచిరాపల్లి (సోమ,శుక్ర) గువాహటి నుంచి మూడు రోజులు జోలార్‌పేట్ వరకూ, షాలిమార్ -త్రివేండ్రం(మంగళ, బుధ) ఉన్నాయి. సంత్రాగచి-చెన్నై ఏసీ ఎక్స్‌ప్రెస్ బుధ, శని వారాల్లో నడుస్తోంది. వీటిలో బెర్తులు దొర కాలంటే అదృష్టాన్ని నమ్ముకోవాల్సిందే. భువనేశ్వర్, హౌరా, షాలిమార్ నుంచి వచ్చే రైళ్లలో అడుగుపెట్టడానికి వీలుండదు.
ఇంటర్ సిటీలు వేయాలి..
ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, బిహా ర్ నుంచి ఉపాధి పనుల నిమిత్తం కూలీలు పెద్ద సంఖ్యలో కేరళ, తమిళనాడు, కర్నాటక వెళుతుంటారు. వేసవిలో తిరుగు ప్రయాణ మవుతారు. అందుకే చెన్నై, బెంగళూరు, అళ పుజ, తిరువనంతపురం నుంచి సిల్చార్, న్యూ తిన్సూకియా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఖాళీ ఉండదు. ఈ క్రమంలో వేస వి సెలవులకు విహారయాత్రలకు వెళదా మ ని అనుకున్న వారితోపాటు ఆస్పత్రి పనులపై చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్తగా వారాంతపు, బైవీక్లీ రైళ్లు వేస్తున్నా ఈ ప్రాంతం వాసులకు ఉపయో గం ఉండడం లేదు. ఈ ప్రాంతం నుంచి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు వేయాలనే డిమాం డ్ ఎప్పటి నుంచో ఉంది. వేసవిలో నైనా విశాఖ-విజయవాడ,విజయవాడ-చెన్నై, హైద రాబాద్, బెంగళూరు, విశాఖ- భువనేశ్వ ర్,రాజమండ్రి-విజయవాడ, విశాఖపట్నం ఇం టర్ సిటీలు నడపితే నాలుగు జిల్లాల ప్రయాణికుల తిప్పలు తగ్గే అవకాశం ఉంది.