చెత్త సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ఆందోళన
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:46 AM
యానాం లో చెత్త సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ యానాం శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు.
యానాం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): యానాం లో చెత్త సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ యానాం శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ యానాం శాఖ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాంటంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, అభిమానులు రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను ట్రాక్టర్లతో లోడ్ చేసుకుని ఆర్‌ఏ కార్యాలయానికి బయలుదేరారు. ఆర్‌ఏ కార్యాలయ సమీపంలోని ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే కాంగ్రెస్ నాయకులు బైఠాయించి ఆందో ళన చేపట్టారు. లోపలికి చెత్త ట్రాక్టర్లను అనుమతించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట ఆందో ళన చేపట్టారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. యానాం ఎమ్మెల్యే అనాలోచి నిర్ణయంతో ఈసమస్య ఏర్పడిందన్నారు. మూడు నెలలుగా యానాంలో చెత్త సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకుంటే పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ వైద్యలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామిని యానాం ఆహ్వానించి, వారితో ఆందోళన చేపడతామన్నారు. అలాగే ఆర్‌ఎ, మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రజలతో చెత్త వేసేలా చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులతో పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు. త్వరలో సమస్య పరిష్కారా నికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలపడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించారు. అన్నడీఎంకే యానాం శాఖ కార్యదర్శి మంచాల సత్యసాయి కుమార్, నల్ల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.