Share News

బ్యాంక్‌ మేనేజర్‌ ఉరఫ్‌ లేడీ రౌడీ షీటర్‌

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:53 AM

బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా మారిన ఓ మాజీ ఉద్యోగిని కథ ఇది..

బ్యాంక్‌ మేనేజర్‌ ఉరఫ్‌ లేడీ రౌడీ షీటర్‌

హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్‌ హిస్టరీ

బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ

దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన

స్వగ్రామం మర్రిబంధం చేరుకుని అరాచకాలు

ఆగడాలు భరించలేక రౌడీషీట్‌ తెరిచిన పోలీసులు

తాజాగా జనసేన నేతపై దాడి ఘటనతో కలకలం

చేతులు కట్టేసి కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి

స్పృహ తప్పిన నేతను ఆస్పత్రికి చేర్చిన గ్రామస్థులు

ఏలూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా మారిన ఓ మాజీ ఉద్యోగిని కథ ఇది.. ఆమె హిస్టరీ అంతా ఆగడాలు.. అరాచకాలే! పని చేస్తున్న బ్యాంకులో బంగారం చోరీచేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం ఏలూరు జిల్లా మర్రిబంధం చేరుకుని స్థానికంగా అడ్డూఅదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. అప్పటినుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయి. ఈ క్రమంలో మర్రిబంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెర లేపారు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో బ్యాంక్‌ మేనేజర్‌గా ప్రభావతి కొంతకాలం పనిచేశారు. నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కవులూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కవులూరి యోగికి, ప్రభావతికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులను; తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, వంగలపూడి అనితను ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలోని స్థానిక జనసేన నాయకులను ఆయన సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనవల్లి వెంకట్రావు మర్రిబంధంలో చూస్తున్నారు. అయితే, వెంకట్రావు.. పవన్‌కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చారంటూ ఆయనపై ఆమె కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి... తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్‌లతో కలిసి దాడి చేశారు. చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిని గమనించిన గ్రామస్థులు, ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి,సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థుల సాయంతో క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆస్పుత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

hj.jpg

ఆది నుంచి వివాదాలే..

ప్రభావతి ఆది నుంచీ వివాదాస్పదురాలే. సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కైంకర్యం చేశారు. మర్రిబంధం పక్కనే గల పల్లెర్లమూడిలో బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గ్రామంలో ప్రతి రోజూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉండటంతో నూజివీడు రూరల్‌ పోలీసులు ఆమెపై రౌడీషీట్‌ సైతం నమోదు చేశారు. అయితే, ప్రభావతిపై పోలీసులు చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం చేటు చేసుకోవడం వల్లే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభావతి ఒక పథకం ప్రకారం గతంలోనూ, ఇప్పుడూ అధికార పార్టీ నాయకుల పేర్లను వాడుతుండటంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆమె బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు. ఇప్పటికైన పోలీసులు తక్షణం స్పందించి ప్రభావతిని అదుపులోకి తీసుకుని తమకు రక్షణ కల్పించాలని మర్రిబంధం గ్రామస్థులు కోరుతున్నారు. కాగా, గాయపడిన వెంకట్రావును ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అఽధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, ఇతర జనసేన నాయకులు నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు.

Updated Date - Jan 02 , 2025 | 04:53 AM