Share News

Jyotirao Phule Jayantho: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:37 AM

రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఫూలే సేవలను ప్రముఖులు కొనియాడుతూ ఆయన సమానత్వానికి, విద్యకు చేసిన కృషిని స్మరించుకున్నారు

Jyotirao Phule Jayantho: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా తదితర అధికారులు పాల్గొని ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో జన్మించిన కుల వ్యతిరేక కార్యకర్త, రచయిత, ఆలోచనాపరుడు, సామాజిక సంస్కర్త ఫూలే అని పేర్కొన్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అమరావతి సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కార్యదర్శి రాజమౌళి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ తదితర అధికారులు నివాళులర్పించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, కృష్ణమూర్తి, గౌడ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


విద్యకు ఫూలే ప్రాధాన్యం: పవన్‌

సమాజంలో అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తపించిన మహానీయుడు స్వర్గీయ జ్యోతిరావు ఫూలే అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. శుక్రవారం ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటించారు. ‘మహిళా సాధికారతకు విద్యే మార్గమని భావించి ప్రతి ఆడబిడ్డకి చదవు అందించేందుకు ఫూలే, శ్రీమతి సావిత్రాభాయి ఫూలే చేసిన కృషిని ఎన్నటికి మరువలేం. సత్యం, సమానత్వం అనే సూత్రాల ఆధారంగా సమ, సమాజ స్థాపన సాధ్యమని భావించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జ్యోతిరావు ఫూలే భావనలను ఆలంబనగా చేసుకొని బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తుంది’ అని పవన్‌ చెప్పారు.

Updated Date - Apr 12 , 2025 | 05:45 AM