Share News

CM Name Sand Scam: ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:51 AM

ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులను బెదిరిస్తూ ముఠా దౌర్జన్యానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది

CM Name Sand Scam: ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం

  • ముఖ్యమంత్రి పేరిట.. మట్టి అక్రమాలు

  • అడ్డుకున్న వారికి బెదిరింపులు

  • అమాత్యుని ఇలాకాలో అనుమతులు లేకుండా

  • గ్రావెల్‌ తవ్వకాలకు తెగబడుతున్న వైనం

  • ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠా

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుచెప్పి, మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం నూజివీడులో యఽథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా దౌర్జన్యకాండ శుక్రవారం వెలుగు చూసింది. నెల రోజుల నుంచి నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో ఒక పెద్ద గ్రావెల్‌ కొండ నుంచి రాత్రిళ్లు యఽథేచ్ఛగా గ్రావెల్‌ తరలింపు సాగుతోంది. శుక్రవారం నుంచి ఉదయం పూట కూడా అక్రమ క్వారీయింగ్‌కు తెరదీశారు. పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. గమనించిన గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్‌లో గ్రామస్థులతో మాట్లాడుతూ.. ‘‘సీఎం ఇంటికి మట్టి తవ్వుతుంటే అడ్డుకుంటారా!. అడ్డొస్తే తొక్కించేస్తాం.’’ అని బెదిరింపులకు దిగడంతో గ్రామస్థులు నిర్ఘాంతపోయారు. ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్న మాట. ఈ అక్రమ క్వారీయింగ్‌ను గ్రామస్థులు ఇటీవల గుర్తించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు.


ఈ నేపథ్యంలో గ్రామస్థులు నిఘా పెట్టారు. ఈ గ్రావెల్‌ గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లడం గమనించిన ఈ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లను అడ్డగించాడు. నిర్వాహకులు బెదిరింపులకు దిగడంతో గ్రామస్థులు అనుమతులు చూపాలంటూ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయమై నిన్న మొన్నటి వరకు మంత్రి పార్థసారఽథి పేరును స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించవరకు వ్యవహారం వెళ్లింది. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన మంత్రి అనుచరుడు(నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు) శుక్రవారం సాయంత్రం నరసింగపాలెం గ్రామస్థులు అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి క్షమాపణ చెప్పారు. ఇక క్వారీయింగ్‌ చేయబోనని చెప్పారు. ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్థులు మౌనం వహించారు.

విజిలెన్స్‌ విచారణ జరపాలి

నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని అన్ని క్వారీలపై విజిలెన్స్‌ విచారణ జరపాలని డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. 15 ఏళ్ల క్రితం ఇచ్చిన అనుమతులనే అడ్డం పెట్టుకొని చాలా మంది అక్రమ క్వారీయింగ్‌ పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో ఈ విషయంపై విచారణ చేసిన అధికారుల బృందం ఆగిరిపల్లి మండలంలోని ఓ క్వారీ నిర్వాహకులపై కాకుండా అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌పై రూ.3 కోట్ల వరకు అపరాధ రుసుము విధించింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న మొత్తం క్వారీలపై విజిలెన్స్‌ విచారణ నిర్వహిస్తే మట్టి లూటీ వ్యవహారం బయటకు వస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 05:51 AM