Hajj 2025 Preparations: హజ్ యాత్రకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:39 AM
హజ్ యాత్ర 2025 ఏర్పాట్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.యాత్రికుల కోసం భద్రమైన వసతి, వైద్య సదుపాయాలు, ప్రత్యేక సహాయ సేవలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల సమన్వయ సమావేశంలో పలు నిర్ణయాలు
ఏపీ నుంచి మంత్రి ఫరూక్, తెలంగాణ నుంచి షబ్బీర్ అలీ హాజరు
ప్రభుత్వ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకోవాలి: ఫరూక్
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): హజ్ యాత్ర-2025 ఏర్పాట్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సమన్వయ కమిటీ సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో నిర్వహించారు. ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహరాల ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. హజ్ యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఉపయోగించుకునే ఏపీ యాత్రికుల కోసం అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నోడల్ అధికారులను నియమించడం, స్పష్టమైన పికప్, డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఏర్పాటు చేయడం, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులైన యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సహాయ సేవలు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంబార్కేషన్ కేంద్రం సమీపంలో ఏపీ యాత్రికులకు భద్రమైన, పరిశుభ్రమైన వసతి ఏర్పాట్లను తెలంగాణ హజ్ కమిటీతో సమన్వయం ద్వారా చేయాలని, తగిన ప్రాంగణాలను కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పురుషులు, మహిళల కోసం వేర్వేరు వసతి కేంద్రాలు, నాణ్యమైన-ఆరోగ్యకరమైన భోజన వసతి, శుద్ధ తాగునీటి సదుపాయాలు, సేవలందించే సంస్థలను ఎంపిక చేయడం, వాటిపై పర్యవేక్షణ విధానం అమలు చేయడం, విమానాశ్రయ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడానికి తెలుగు రాష్ట్రాల పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. ఏపీ నుంచి 1630 మంది హజ్ యాత్రకు ఈ ఏడాది వివిధ దశల్లో హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల నుంచి బయలుదేరుతున్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.