Health Minister Satyakumar : నిస్సిగ్గుగా.. నిర్భీతితో అబద్ధాలు
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ రాజకీయ దిగజారుడుతనానికి, అబద్ధాలే ప్రధానంగా కొనసాగే మీ
జగన్‌పై ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఫైర్
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ రాజకీయ దిగజారుడుతనానికి, అబద్ధాలే ప్రధానంగా కొనసాగే మీ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును మీరు అర్థం చేసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికీ నిస్సిగ్గుగా, నిర్బీతితో, భారీస్థాయిలో అబద్ధాలు చెబుతున్నారు’ అని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ‘జగన్ హయాంలో సగటున ఏడాదికి రూ.1807.64 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ చెల్లింపులు జరిగితే, కూటమి ప్రభుత్వం మొదటి ఆరు నెలల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవలకు రూ.1850 కోట్లు చెల్లించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయించింది. ఈ వాస్తవాన్ని విస్మరించి నగదు రహిత సేవల్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జగన్ అసత్య ప్రచారానికి దిగజారారు. జగన్ ప్రభుత్వం రూ.2,221.60 కోట్ల బకాయిలు పెడితే, కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించడం అవాస్తవం’ అని పేర్కొన్నారు. వైద్య సేవల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందంటూ జగన్ చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం బకాయిలపై ఆందోళన వ్యక్తం చేసిన వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి, రూ.500 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిందన్నారు. అబద్దాల పునాదులపై రాజకీయ సౌధాన్ని పునర్నిర్మించుకోవాలనే దురాలోచనలు మాని.. ఇప్పటికైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సలహా ఇచ్చారు.