Share News

YSRCP MLA: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:29 AM

వైసీపీ మాజీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

 YSRCP MLA: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ

పోక్సో కేసులో క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మైనర్‌ బాలికపై లైంగికదాడి జరిగిందని మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను పోక్సో చట్టం కింద ఆయనపై నమోదైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తన మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని సాక్షి మీడియాలో ప్రకటన చేసిన చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యర్రవారిపాలెం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇరువైపుల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెల్లడించారు. ‘బాలిక అత్యాచారానికి గురైందంటూ చెవిరెడ్డి చెప్పిన మీదటే ఆ పత్రికలో కథనం ప్రచురితం అయినట్లు కేసు డైరీని పరిశీలిస్తే తెలుస్తోంది. బాలికపై అత్యాచారం జరగకపోయినా, జరిగిందని మీడియాకు చెప్పడం చట్టనిబంధనలకు విరుద్ధమన్న పీపీ వాదనతో ఏకీభవిస్తున్నాం. చెవిరెడ్డితో బాలిక తండ్రి కుమ్మక్కు అయ్యారని ప్రాసిక్యూషన్‌ చెబుతున్న వ్యవహారంపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సున్నితమైన ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేం. అందువల్ల క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేస్తా: చెవిరెడ్డి

తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినా... సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తానని చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. తన వద్దనున్న ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచుతానని శుక్రవారం ఓ ప్రకటనలో వివరించారు. ముందస్తు బెయిల్‌ మాత్రం కోరనని చెప్పారు. ఎప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 03:30 AM