Share News

హైవేలో దొంగతనం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:30 PM

వాహనంపై ఉన్న 12 బ్యాగులు, అందులో ఉన్న రూ.70 వేలు శనివారం తెల్లవారుజామున కడప- కర్నూలు హైవేలో చోరీకి గురైనట్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నాగూరు ప్రాంతానికి చెందిన అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    హైవేలో దొంగతనం

వాహనంపై ఉన్న 12 బ్యాగులు, రూ.70 వేలు అపహరణ

పోలీసులకు భక్తుల ఫిర్యాదు

మహానంది, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): వాహనంపై ఉన్న 12 బ్యాగులు, అందులో ఉన్న రూ.70 వేలు శనివారం తెల్లవారుజామున కడప- కర్నూలు హైవేలో చోరీకి గురైనట్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నాగూరు ప్రాంతానికి చెందిన అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. కేరళ అయ్యప్ప స్వామి యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన బాబుల్‌రెడ్డితో పాటు మరో 10 మంది ఒక వాహనాన్ని అద్దెకు తీసుకొని ఈనెల 5 వతేది బయలు దేరారు. యాత్రల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నుంచి శుక్రవారం తిరుగు పయనమయ్యారు. అయితే మహానంది క్షేత్రాన్ని దర్శించాలనే ఉద్దేశంలో భాగంగా శనివారం తెల్లవారుజామున కడప- కర్నూలు హైవే మీదుగా క్షేత్రానికి చేరుకొన్నారు. ఆలయం ముందు భాగంలో భక్తులు వాహనం నిలుపుకొని నిద్రకు ఉపక్రమించారు. ఉదయం నిద్ర లేచి చూడగా వాహనంపై ఉన్న బ్యాగులు లేవని గుర్తించారు. భక్తులు మహానంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కానిస్టేబుల్‌ శేషన్న ఘటనా స్థలాన్ని, పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా వాహనంపై భాగంలోని బ్యాగులు మహానందికి వచ్చే సరికే చోరికి గురైనట్లు నిర్ధారించారు. భక్తుల ప్రయాణ విషయాలను సేకరించారు. తాము కడప నుంచి హైవే మీదుగా వచ్చామని, మార్గమధ్యంలోని చాగలమర్రి వద్ద కొద్దిసేపు ఆపి విశ్రాంతి తీసుకొన్నట్లు చెప్పారు. తిరిగి ప్రయాణించేటప్పుడు వాహనంపై తమ బ్యాగులను గమనించలేదని చెప్పారు. అక్కడే చోరీ జరిగి ఉండవచ్చని అనుమనాలను భక్తులు వ్యక్తం చేశారు. బ్యాగుల్లో రూ.70 వేల నగదుతో పాటు కొత్త దుస్తులు ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా గత 10 రోజుల క్రితం మహానందికి దర్శనం కోసం వచ్చిన భక్తుల బస్సులోని వాహనం వెనుక వైపు క్యాబినలో ఏర్పాటు చేసుకొన్న బ్యాగులను కడప హైవేలో క్యాబిన బోట్లను పెకిలించిన చోరీ చేసిన ఘటన మరువక ముందే మరోసారి బ్యాగులు చోరీకి గురికావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవేలో చోరీలపై పోలీసులు నిఘూ ఉంచి భక్తుల సొమ్ముకు భధ్రత కల్పించాలని కోరారు.

Updated Date - Jan 12 , 2025 | 11:30 PM