గోదాం వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకున్నారు!
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:23 AM
గోదాం వ్యవహారాలన్నీ తమ మేనేజర్ మానస తేజ చూసేవారని మాజీమంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలు(ఏ-1) జయసుధ తెలిపారు.
గోదాం వ్యవహారాలు నాకేమీ తెలియదు: పేర్ని నాని భార్య
బియ్యం మాయం కేసులో పోలీసుల ముందు హాజరు
మచిలీపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గోదాం వ్యవహారాలన్నీ తమ మేనేజర్ మానస తేజ చూసేవారని మాజీమంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలు(ఏ-1) జయసుధ తెలిపారు. ఈ వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. బుధవారం మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషన్‌లో విచారణకు ఆమె హాజరయ్యారు. మధ్యాహ్నం 2నుంచి సాయత్రం 4.30 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగింది. రాబర్ట్‌సన్‌పేట సీఐ ఏసుబాబు, మచిలీపట్నం తాలూకా ఎస్‌ఐ సత్యనారాయణ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. పొట్లపాలెంలో గోడౌన్ నిర్మాణం ఎప్పుడు చేశారు.. ఎంత భూమి కొన్నారు.. గోడౌన్ ఎవరి పేరున ఉంది.. ప్రభుత్వానికి ఎప్పడు, ఎంత అద్దె ప్రాతిపదికన ఇచ్చారు.. గోడౌన్‌లో బియ్యం నిల్వ వ్యవహారాలను మీరే చూశారా.. నగదు లావాదేవీలు ఎవరు చూసేవారు తదితర ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టారు. అనంతరం ఇద్దరు జామీనుదారులతో పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. తర్వాత ఆమె స్టేషన్ నుంచి వచ్చారు. కాగా.. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు ప్రభుత్వం కేటాయించిన కారులో జయసుధ స్టేషన్‌కు రావడం వివాదాస్పదమైంది. ఇంకోవైపు ఆమె రావడంతో అక్కడకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకుని హడావుడి చేశారు. బియ్యం మాయం కేసులో ఏ-1గా ఉన్న పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా కోర్టులో గత నెల 30వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.