ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిలలో ప్రార్థనలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:43 PM
యేసుక్రీస్తుకు శిలువ వేయబడిన సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): యేసుక్రీస్తుకు శిలువ వేయబడిన సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని వివిధ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గోకుల్‌నగర్‌లోని ఎస్పీజీ-2 చర్చిలో పాస్టర్ రెవరెండ్ కోలాటిరాజు గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పుడు మానవాళికి చెప్పిన ఏడు వాక్యాలను ప్రేమ, కరుణ, దయ, మానత్వం, త్యాగం, క్షమాగుణం, సహనాన్ని కలిగి ఉండాలని తెలిపారు. యేసుక్రీస్తు త్యాగానికి గుర్తుగా గుడ్‌ఫ్రైడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు భక్తిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, క్రైస్తవులు పాల్గొన్నారు. రామేశ్వరంలోని సీఎస్‌ఐ చర్చిలో డివిజనల్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జాకోబ్‌ప్రాంక్ మాట్లాడుతూ క్రీస్తు జీవితం మానవాళికి మార్గదర్శకమన్నారు. యేసుక్రీస్తు శాంతిదూతగా అవతరించారని మానవాళి పాపపరిహారం కోసం తన ప్రాణాలను అర్పించారన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ఆరాధన నిర్వహించారు.
జమ్మలమడుగులో: జమ్మలమడుగులో శుక్రవారం ఆయా చర్చిలలో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. అందులో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని టౌన్ చర్చిలో సీఎస్‌ఐ, టీసీసీ, ఐక్య ఆరాధనలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అలాగే పట్టణంలోని సీఎస్‌ఐ క్రైస్ట్‌చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రైస్తవులను ఉద్దేశించి సంఘ గురువులు జనార్ధన్‌బాబు, థామస్‌బాబు, జోషఫ్‌బాబు తదితరులు సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరు క్రీస్తుబాటలో నడవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు పట్టణంలోని క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.