గ్రామాల్లో పౌరసేవల తీరుపై పరిశీలన
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:44 PM
గ్రామాల్లో ప్రజలకు అందుతున్న పౌర సేవలు, మౌలిక సదుపాయాల తీరుపై అధికారులు పరిశీలన నిర్వహించారు.
ప్రొద్దుటూరు రూరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు అందుతున్న పౌర సేవలు, మౌలిక సదుపాయాల తీరుపై అధికారులు పరిశీలన నిర్వహించారు. గురువారం జడ్పీ సీఈవో, డీపీవో ఆదేశాల మేరకు నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామంలో ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి, ఈవోపీఆర్‌డీ రామాంజనేయులరెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు. స్థానికులను అడిగి పౌర సేవల తీరుతెన్నులపై తెలుసుకున్నారు. నిత్యం ఇంటింటి నుంచి చెత్తసేకరణ, మురుగు కాలువల్లో పూడికల తీసివేత, మంచినీటి సరఫరా, ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలను పరిశీలించారు. గ్రామంలో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే చర్యలను చేపట్టారు. స్థానిక సుందరయ్య కాలనీలో సర్పంచ్ శివచంద్రారెడ్డి పర్యటించి అక్కడ అధ్వాన్నంగా ఉన్న మురుగు వ్యవస్థ, కాలువల నిర్మాణం, రోడ్ల నిర్మాణం తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపుతామని చెప్పారు.