Share News

బంకుల విషయమై గుర్రంకొండలో ఉద్రిక్తత...!

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:20 AM

పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న బీఎల్‌డబ్ల్యూ క్వార్టర్స్‌ స్థలంలో అక్రమంగా రేకు బంకులను ఏర్పాటు చేస్తుండడంతో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బంకుల విషయమై గుర్రంకొండలో ఉద్రిక్తత...!
బంకుల విషయమై ఘర్షణ పడుతున్న యువకులు

ప్రభుత్వ స్థలం ఆక్రమణ

గుర్రంకొండ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌ ఎదురుగా ఉన్న బీఎల్‌డబ్ల్యూ క్వార్టర్స్‌ స్థలంలో అక్రమంగా రేకు బంకులను ఏర్పాటు చేస్తుండడంతో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది యువకులు ఓ చోట గుమికూడి బంకుల ఏర్పాటును అడ్డుకోవడంతో కొంత సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో సర్దుమనిగింది. పట్టణ నడిబోడ్డున బీఎల్‌డబ్ల్యూ క్వార్టర్స్‌ ఉంది. ఇవి శిథిలావస్థకు చేరుకుంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైసీపీ నాయకులు అక్రమించుకొని కబ్జాకు యత్నించారు. అప్పట్లో జిల్లా అధికారులకు ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లడంతో అలానే వదిలేశారు. ఈ క్రమంలో కొంత స్థలంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా మిగిలిన స్థలం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఈ స్థలం 2 కోట్లకు పైగా విలువ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖాళీ స్థలంలో కొందరు నాయకులు రేకుల బంకులను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రేకులషెడ్డులను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయరాదంటూ అదే వర్గంలోని వందలాది మంది యువకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరిమూకలను తరిమేశారు. అధికారుల అనుమతులు లేకుండా ఎటువంటి బంకులను ఏర్పాటు చేయకూడదని పోలీసులు సూచించారు.

Updated Date - Jan 11 , 2025 | 12:20 AM