Share News

వైసీపీ ఎంపీటీసీల హైడ్రామా..?

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:43 PM

ఎంపీడీవో సభాభవనంలో గురువారం ఉదయం 10-30గంటలకు జరగవలసిన మండల సర్వసభ్య సమావేశం వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించడంతో వాయిదా పడింది.

వైసీపీ ఎంపీటీసీల హైడ్రామా..?
ఎంపీటీసీలను బ్రతిమాలుతున్న ఎంపీడీవో కార్యాలయ ఏవో అరుంధతి

మండల సమావేశాన్ని బహిష్కరించిన

వైసీపీ ఎంపీటీసీ, కోఆప్షన్‌ సభ్యులు

తొమ్మిది వరుస మండల సమావేశాలకు

హాజరుకాని వైసీపీ ఎంపీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి

వైసీపీ ప్రభుత్వం నుంచే గౌరవవేతనం

పెండింగ్‌లో ఉందంటూ ఆరోపణ

ఎంపీపీ ఛాంబర్‌లో నిరసన

మీటింగ్‌కు హాజరుకావాలని ఎంపీటీసీలను

బతిమాలుకున్న ఎంపీడీవో కార్యాలయ ఏవో

గౌరవవేతం చెల్లించినట్లు అధికారుల వెల్లడి

హాజరైన ఇద్దరు బీజేపీ ఎంపీటీసీ సభ్యులు

ముద్దనూరు ఏప్రిల్‌17(ఆంధ్రజ్యోతి):ఎంపీడీవో సభాభవనంలో గురువారం ఉదయం 10-30గంటలకు జరగవలసిన మండల సర్వసభ్య సమావేశం వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించడంతో వాయిదా పడింది. కేవలం ఎంపీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఎంపీటీసీ సభ్యత్వం రద్దు అవుతుందన్న కారణంగా వైసీపీ ఎంపీటీసీలు మూకుమ్మడిగా కొన్ని కుంటి సాకులతో హైడ్రామాకు తెరలేపి సమావేశానికి బహిష్కరించి వాయిదా పడేటట్లు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో ఉదయం 10-30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు,ఒక కోఆప్షన్‌ సభ్యులు ఉన్నారు.వారిలో ముగ్గురు కూటమి సభ్యులు కాగా మిగిలిన వారు వైసీపీకి చెందిన వారే. దీంతో ఎంపీపీగా శెట్టివారిపల్లె ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈయన వరుసగా తొమ్మిది మండల సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వసభ్యసమావేశాలకు గైర్హాజరవుతున్న ఎంపీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పెనికెలపాడు ఎంపీటీసీ ఏసుదాసు, కోఆప్షన్‌ మెంబర్‌ ఖదీర్‌ పై జడ్పీ సీఈవో దృష్టికి తీసుకెళ్లగా సీఈవో ఆదేశాల మేరకు నోటీసులు కూడా ఇచ్చినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు.దీంతో సర్వసభ్య సమావేశం జరిగితే ఏవిధమైన వివరణ ఇవ్వాల్సి వస్తుందో , ఎక్కడ సభ్యత్వం తొలగిస్తారోనని వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా ముద్దనూరు 1, 2 కొర్రపాడు, ఉప్పలూరు, నల్లబల్లె, పెనికెలపాడు, కోఆప్షన్‌ సభ్యులు ఎంపీడీవో కార్యాలయం చేరుకొని ఎంపీపీ ఛాంబర్‌లో కూర్చొని సర్వసభ్య సమావేశంను బహిష్కరిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఒకటిన్నర సంవత్సరం మాత్రమే గౌరవవేతనం అందించారన్నారు. 11గంటలు దాటినా ఎంపీటీసీ సభ్యులు సమావేశ భవనంలోకి రాకపోవడంతో సమావేనికి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న ఏవో అరుంఽదతి వైసీపీ ఎంపీటీసీలు ఉన్న ఎంపీపీ చాంబర్‌లోకి వెళ్లి సమావేశం సజావుగా జరిగేందుకు సహకరించాలని బతిమాలారు. ఒక మహిళా అధికారి బతిమాలుతున్నా మహిళా ఎంపీటీసీలు స్పందించకపోవడంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంకు వచ్చిన ముగ్గురు కూటమి సభ్యుల హాజరుతీసుకున్నారు.

గౌరవవేతనం ప్రతిఏటా అందిస్తున్నారు

ప్రతి ఏటా ఎంపీటీసీలకు గౌరవేతనం అందుతోందని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా 2023-24 సంవత్సరంకు సంబందించిన గౌరవవేతనం ఎంపీటీసీ ల బ్యాంకు ఖాతాల్లో జమఅయిందని ఎంపీడీవో కార్యాలయ ఏవో, సమావేశ ఇన్‌చార్జి అరుంధతి తెలిపారు. 2024- 25 కు సంబంధించిన గౌరవేతనం బిల్లు పెట్టడం జరిగిందని గౌరవేతనం అందించలేదన్న దానిలో ఎంపీటీసీలు చేసిన ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. సమావేశం వాయిదా విషయమై జడ్పీ సీఈవో దృష్టికి తీసుకెళతాం.

సమావేశానికి గైర్హాజరవుతున్న

ఎంపీటీసీలపై ఫిర్యాదు చేశాం

వరుస మండల సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరవుతున్న శెట్టివారిపల్లె ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పెనికెలపాడు ఎంపీటీసీ ఏసుదాసు, కోఆప్షన్‌ మెంబర్‌ ఖదీర్‌ పై జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశాం.సీఈవో ఆదేశాల మేరకు ముగ్గురికి నోటీసులు పంపడం జరిగింది. పెనికెలపాగు ఎంపీటీసీ మాత్రమే ఆరోగ్య సమస్యకారణంగా రాలేకపోతున్నానని వివరణ ఇచ్చారు.

-ముకుందారెడ్డి, ఎంపీడీవో, ముద్దనూరు

Updated Date - Apr 17 , 2025 | 11:43 PM