CRDA : అమరావతి ‘పీఎంసీ’లకు టెండర్లు
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:08 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్
సంస్థలకు పనుల పర్యవేక్షణ బాధ్యత
వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేఎ్‌ఫడబ్ల్యూ హడ్కో నుంచి రూ.31 వేల కోట్ల రుణం
రూ.20 వేల కోట్ల పనులకు టెండర్లు
సీఆర్‌డీఏ కార్యాలయం, హ్యాపీనెస్ట్, ఎల్‌పీఎస్ వరద మళ్లింపు కాల్వల పనులకు శ్రీకారం
విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రాష్ట్ర సచివాలయం, శాసన సభ, హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ త్వరలోనే శ్రీకారంచుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల(పీఎంసీ) నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పీఎంసీలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు ఈ పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశాక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా పీఎంసీలే నిర్వహించాల్సి ఉంటుంది.
పీఎంసీ టెండర్లు ఎందుకంటే
మరో రూ.11 వేల కోట్ల పనులకు సంబంధించి టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో రాజధానిలో అత్యంత ప్రధానమైన సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మిగిలి ఉంది. ఇవి భారీ ప్రాజెక్టులు కావటంతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల(పీఎంసీ)ను నియమించనున్నారు. ఈ పీఎంసీలు ఆయా పనులను పర్యవేక్షించడంతోపాటు అంచనాలను కూడా రూపొందించనున్నాయి. ఈ నియామకాలు పూర్తికాగానే సచివాలయ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
టెండర్ల జోష్
అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎ్‌ఫడ బ్ల్యూ వంటి సంస్థల నుంచి రూ.31 వేల కోట్ల మేరకు రుణం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రుణంలో ఇప్పటి వరకు రూ.20 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించారు. తొలుత సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం పనులతో ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. అమరావతి రైతుల త్యాగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీఎస్ ట్రంక్ ఇన్‌ఫ్రా పనులకు సీఆర్‌డీఏ పెద్దపీట వేసింది. పెద్ద ఎత్తున ఎల్‌పీఎస్ జోన్లలో రోడ్లు, డ్రెయిన్లు, నీటి పైపులైన్లు, సీవరేజీ, యుటిలిటీ డక్ట్స్, అవెన్యూ ప్లాంటేషన్ తదితర పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. జోన్-12, 12ఏ, 10, 2, 6, 2ఏ, 2బీ, 6, 1ఏ, 1బీ, 5బీలో ఈ పనులు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు పిలిచిన రూ.20 వేల కోట్ల టెండర్లలో సింహభాగం ఈ పనులే ఉన్నాయి. ఎల్‌పీఎస్ జోన్ల తర్వాత ప్రధానంగా అమరావతిలో వరద నివారణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. నీరుకొండ బ్యాలెన్స్ ఫ్లడ్ మిటిగేషన్ పనులు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తరణతో పాటు ఆధునికీకరణ పనులకు అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. వీటితోపాటు ఈ-8, 9, 14, 3, ఎన్-12, 6, 9 రోడ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కోసం కూడా టెండర్లు పిలిచారు. దాదాపు మేజర్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.