మాయలేడీలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:54 AM
బ్యాంకులు చేయలేని పని తాము చేస్తామంటారు. పెట్టుబడిని డబుల్ చేస్తామని నమ్మబలుకుతారు. తమది ఒక మల్టీ నేషనల్ కంపెనీ అని బిల్డప్ ఇచ్చి ట్రాప్ చేస్తారు. ధనవంతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. తర్వాత చిరునామా లేకుండాపోతారు. విజయవాడ కేంద్రంగా ఓ మహిళా ముఠా చేస్తున్న మోసాలకు బలైపోయిన వారు పోలీసులను ఆశ్రయించారు. అప్పులు ఇచ్చిన వారి ఇంటికెళ్లి చోరీలు చేస్తున్న సదరు ముఠా లీడరైన మహిళను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
నగరంలో మహిళా ముఠా హల్‌చల్
ధనవంతులే టార్గెట్‌గా పెట్టుబడుల పేరుతో వసూళ్లు
ఖరీదైన అపార్టుమెంట్లలో ఫ్లాట్ తీసుకుని బిజినెస్
రెట్టింపు డబ్బు ఇస్తామని చెప్పి మాయమాటలు
రూ.56 లక్షలు ఇచ్చి మోసపోయిన ఓ కాలనీవాసి
గుట్టుగా వ్యాపారం ముగించుకుని పరార్
కాలనీవాసి ఇంట్లో డాక్యుమెంట్ల చోరీకి యత్నం
డాక్యుమెంట్లు దొరక్కపోవడంతో బంగారం దొంగతనం
కొమ్ముకాస్తున్న టీడీపీ నేత.. ఎట్టకేలకు మహిళ అరెస్టు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరానికి చెందిన వంకాయలపాటి పావని, చెన్నైకు చెందిన కొప్పకొండ లక్ష్మి, ఆమె తల్లి శ్యామల, వైజాగ్‌కు చెందిన గంగాధర్, కావ్య అనే మరో మహిళ ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నగరాలు, పట్టణాల్లో ధనవంతులు ఉండే కాలనీల్లోని అపార్టుమెంట్లలో ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటారు. అందులో టేబుళ్లు, కుర్చీలు, కంప్యూటర్లు అమర్చుకుని ఓ పేరు పెడతారు. అలాగే, నగరంలోని వెటర్నరీ కాలనీలో ‘యుక్తాస్’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న ధనవంతులను టార్గెట్ చేసుకుని వ్యవహారాలు నడిపించారు. చెన్నైకు చెందిన లక్ష్మి స్వస్థలం నెల్లూరు. ఆమె భర్త తమిళనాడులోని జెన్‌కోలో ఉద్యోగి. భర్త, పిల్లలు అక్కడ ఉంటే ఆమె విజయవాడలో కంపెనీని ప్రారంభించింది. పెద్ద కుమార్తె పేరు యుక్త. చిన్న కుమార్తె పేరు లాస్య. రెండింటిని కలిపి యుక్తాస్ అని నామకరణం చేసింది. ఈ కంపెనీలో కావ్యను రీజనల్ మేనేజర్‌గా పరిచయం చేసింది. వంకాయలపాటి పావనిని డైరెక్టర్‌గా చూపించింది. ఇలా.. లక్ష్మి, పావని కలిసి ధనవంతులకు వల వేయడం మొదలుపెట్టారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే ఏడాదిలోపే రెట్టింపు చేసి చూపిస్తామని ఆశలు రేకెత్తించారు. తామంతా ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న కంపెనీని ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
పెడితే పెట్టుబడి... లేకపోతే అప్పు
లక్ష్మి, పావని ధనవంతులకు వల వేసేటప్పుడు రెండు రకాల ప్రణాళికలు అమలు చేస్తారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని మొదట ఆఫర్ ఇస్తారు. ఈ ప్లానలో అవతలి వ్యక్తులు పడకపోతే కంపెనీ మల్టీనేషనల్ కంపెనీగా మారిందని, దానికి పెట్టుబడిగా కొంత అప్పు ఇవ్వాలని అడుగుతారు. ఆ విధంగా లక్ష్మి వెటర్నరీ కాలనీకి చెందిన రాజవర్థనరావు అనే వ్యక్తి నుంచి రూ.56 లక్షలు తీసుకుంది. ఆయన ఫ్లాట్‌కు దిగువనే లక్ష్మి అద్దెకు ఉండేది. లక్ష్మి వేసిన స్కెచకు తల్లి శ్యామల వంత పాడేది. ఆయన దగ్గర నుంచి అప్పు తీసుకునేటప్పుడు చెన్నై నుంచి లక్ష్మి భర్త దయాకర్ వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి అప్పునకు సంబంధించి ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. గడువు ముగిసినా అప్పు తీర్చకపోవడంతో ఆయన లక్ష్మిని ప్రశ్నించారు. ఒత్తిడి పెరగడంతో లక్ష్మి కనిపించడం మానేసింది. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా కంపెనీని మూసేసింది. లక్ష్మి రాసిచ్చిన ప్రామిసరీ నోట్లను సంబంధిత వ్యక్తుల ఇళ్ల నుంచి దొంగిలించే బాధ్యతను పావని నిర్వర్తిస్తుంది. ఆమె ఇచ్చిన స్కెచ్‌తో పావని అప్పు ఇచ్చిన రాజవర్థనరావు ఇంటికి వెళ్లి మాట్లాడింది. ప్రామిసరీ నోట్లను ఆయన ఎక్కడ పెడుతున్నాడో పావని అడిగి తెలుసుకుంది. తర్వాత ఆయనకు అనుమానం రావడంతో ఆ డాక్యుమెంట్లను మరోచోటకు మార్చాడు. ఆయన కుటుంబంతో బయటకు వెళ్లేటప్పుడు తాళం ఎక్కడ పెడతారో పావని గుర్తించింది. ఇంట్లో కుటుంబం లేదని తెలుసుకున్న పావని తాళం తీసుకుని లోపలి ప్రవేశించింది. లోపల డాక్యుమెంట్లు దొరక్కపోయేసరికి పది కిలోల వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించింది. ఆభరణాలు కనిపించకపోవడంతో ఆయనకు పావనిపై అనుమానం వచ్చింది. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సీసీఎస్‌కు బదిలీ చేశారు. పావని పాత్ర తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బుతో లక్ష్మి గ్యాంగ్ విశాఖకు పారిపోయినట్టు తెలిసింది. చోరీ కేసులో పావని పాత్ర తేలినప్పటికీ అరెస్టు చేయడానికి పోలీసులకు చాలారోజులు పట్టింది. దీనివెనుక ఓ టీడీపీ నాయకుడి ఒత్తిడి ఉన్నట్టు తెలిసింది. పావనిపై 2019 చోరీ కేసులు ఉన్నాయి. మూడు కేసులు పటమట పోలీస్‌స్టేషన్‌లో, ఒక కేసు మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యాయి. ఇప్పటి వరకు పావనీని పోలీసులు ఏ కేసులోనూ అరెస్టు చేయలేదు. తాజాగా రాజవర్థనరావు ఇంట్లో జరిగి చోరీ కేసులో మాత్రం అరెస్టు చేశారు.