మెటల్ మైనింగ్‌కు మహర్దశ
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:55 PM
రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లూ పడకేసిన నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వమొ చ్చాక బాగా ఊపందుకున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుండటంతో రోడ్లు, భవనాల పనులు చురుకుగా జరుగుతున్నాయి. కొత్త పనులకు టెండర్లు పిలుస్తూ, ప్రభుత్వం చకాచకా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తోంది. పలు బడా నిర్మాణ సంస్థలు భారీ యంత్రాలు, వేలాది కార్మికులతో పనులు చేస్తుండటంతో ఇసుక, సిమెంట్‌తో పాటుగా కోట్లాది మెట్రిక్ టన్నుల కంకర అవసరమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో పరిటాల, గుంటూరు జిల్లాలో పేరేచర్ల ప్రాంతాల్లో నిర్మాణపరంగా నాణ్యతగల కంకర దొరుకుతుంది. పేరేచర్ల ప్రాంతంలో కంకర నాలుగైదేళ్లకు మించి దొరకదు. పరిటాల ప్రాంతంలో రెండు మూడు దశాబ్దాల వరకు మైనింగ్‌కు ఢోకా లేదు. దీంతో ఇక్కడి కంకర, రోడ్డు మెటల్‌కు సమీప భవిష్యత్తులో ఇంకా గిరాకీ పెరగనున్నది. పరిటాల ప్రాంతంలో రోజుకు రెండు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రషర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అమరావతి పుణ్యమా అని మెటల్ మైనింగ్‌కు ఇక మహర్దశ పట్టనున్నది.
రాజధాని పనులతో కంకరకు భలే డిమాండ్
పరిటాల ప్రాంతంలో భారీ సంఖ్యలో క్వారీలు, క్రషర్లు
క్వారీ, క్రషర్ యజమానులకు ఇక మంచిరోజులు
(కంచికచర్ల - ఆంధ్రజ్యోతి)
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 801లో 13 వందల ఎకరాల విస్తీర్ణం కల్గిన కొండపోరంబోకు ఉన్నది. లీజు పద్ధతిపై సుమారుగా 120 క్వారీలు ఉన్నాయి. జిల్లాలో 40కు పైగా క్రషర్లు ఉండగా, పరిటాల ప్రాంతంలోనే 30 వరకు ఉ న్నాయి. వీటిలో 25 క్రషర్లు పెద్దవి పైగా అధునాతనమైనవి. ఒక్కో క్రషర్ సామర్థ్యం రోజుకు 200 నుంచి 250 మెట్రిక్ ట న్నులు. నెలకు ఒక్కో క్రషర్‌లో సగటున 50 వేల 60 వేల మె ట్రిక్ టన్నుల కంకర ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాంతంలోని పెద్ద, చిన్న క్రషర్ల సామర్థ్యం నెలకు సగటున 15 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది.
పరిటాలలో నాణ్యమైన కంకర
నాణ్యతాపరంగా పేరేచర్ల, పరిటాల ప్రాంతాల్లో లభ్యమ య్యే కంకర పటిష్టంగా(గట్టిగా) ఉంటుంది. మెటల్‌లో లూజు ఉండదు. చాలా గట్టిగా ఉంటుంది. పైగా మట్టి, మన్ను ఉం డదు. ఇక్కడి క్రషర్లలో భవన నిర్మాణాల కోసం 40 ఎంఎం, 20 ఎంఎం, 12ఎంఎం, 6 ఎంఎం సైజుల వారీగా కంకర ఉత్పత్తి అవుతుంది. రోడ్డు మెటల్‌కు సంబంధించి జీఎస్పీ, డబ్ల్యూఎంఎం తయారవుతుంది. ఇక్కడి కంకర ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటుగా ఏలూరు, భీమవరం, తెలంగాణ రాష్ట్రం బోనకల్లు, మధిర, వైరా తదితర ప్రాంతాలకు సరఫరా అవుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో క్రషర్ల యజమానులపై రుణాల భారం
వైసీపీ పాలకుల నిర్లక్ష్యం, ఇసుక దొరక్కపోవటం, దోపిడీ విధానాల వల్ల నిర్మాణ రంగం కుదేలు కావటం, రోడ్లు అభివృద్ధి చేయకపోవడం, మూడు రాజధానులంటూ అమరావతిలో ఒక్క పని కూడా చేపట్టకపోవడం తదితర కారణాలతో గడచిన ఐదేళ్లూ కంకరకు పెద్దగా గిరాకీ లేదు. క్వారీలు, క్రషర్లలో సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగలేదు. ప్రతి నెలా కరెంట్ బిల్లులు, బ్యాంకు రుణాల కిస్తీలు చెల్లించలేక క్రషర్ల యజమానులు నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత ఇసుక విధానం పుణ్య మా అంటూ ఒకవైపు నిర్మాణ రంగం ఊపందుకోవటం, మరోవైపు రాజధానిలో చురుగ్గా నిర్మాణ పనులు జరుగుతుండటం వల్ల కంకర, రోడ్డు మెటల్‌కు గిరాకీ పెరగింది. మైనింగ్‌తో పాటుగా ఇక క్వారీ, క్రషర్ల యాజమానుల దశ కూడా మారనున్నది.