అందరిచూపు పరిటాల వైపు..!
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:06 AM
జాతీయ రహదారి చెంతన.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో.. పెద్ద రైల్వేస్టేషన్, భారీ కార్గో టెర్మినల్ ఏర్పాటు కానుండటంతో రియల్టర్ల చూపు ఎన్టీఆర్ జిల్లా పరిటాలపై పడింది. ఇప్పటికే పలు సంస్థలు ఏర్పాటవుతుండటం, సమీప భవిష్యత్తులో పెద్ద నగరంగా రూపాంతరం చెందనుండటంతో ఇక్కడి భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అనూహ్యంగా భూముల ధరలకు రెక్కలు వచ్చి రూ.కోట్లు పలుకుతున్నాయి.
జాతీయ రహదారి చెంతన.. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో.. పెద్ద రైల్వేస్టేషన్, భారీ కార్గో టెర్మినల్ ఏర్పాటు కానుండటంతో రియల్టర్ల చూపు ఎన్టీఆర్ జిల్లా పరిటాలపై పడింది. ఇప్పటికే పలు సంస్థలు ఏర్పాటవుతుండటం, సమీప భవిష్యత్తులో పెద్ద నగరంగా రూపాంతరం చెందనుండటంతో ఇక్కడి భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అనూహ్యంగా భూముల ధరలకు రెక్కలు వచ్చి రూ.కోట్లు పలుకుతున్నాయి.
(కంచికచర్ల - ఆంధ్రజ్యోతి)
కంచికచర్ల మండలం పరిటాల గ్రామ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జాతీయ రహదారితో పాటుగా ప్రధాన రహదారుల వెంబడి భూముల ధరలు రూ. కోట్లు పలుకుతున్నాయి. ఈనెల మొదటి వారంలో ఆంజనేయ స్వామి విగ్రహం-గనిఆత్కూరు వెళ్లే రోడ్డుకు మధ్యలో సర్వీస్ రోడ్డు పక్కన ఎకరం రూ.3.48 కోట్లు పలికింది. బేరసారాలు కుదరటంతో వారంలోనే రిజిసే్ట్రషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. పదిరోజుల క్రితం చెరువు కట్ట వద్ద ఓ రియల్టర్ ఎకరం రూ.2.50 కోట్ల వంతున 1.33 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇటీవల సర్వీస్ రోడ్డుకు ఫర్లాంగు దూరంలో గనిఆత్కూరు వెళ్లే రోడ్డులో ఎకరం రూ. 2.20 కోట్లకు బేరం కుదిరింది. కొద్ది నెలల క్రితం జాతీయరహదారికి కిలోమీటరు దూరంలో పీఆర్ రోడ్డు పక్కన గుంటూరుకు చెందిన వ్యాపారులు ఎకరం రూ.1.25 కోట్ల వంతున 26 ఎకరాలు కొన్నారు. ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వెనుక భాగంలో సైతం ఎకరం రూ.1.50 కోట్ల నుంచి రూ. 1.75 కోట్ల ధర పలుకుతోంది. మున్ముందు ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో రైతులు భూములు అమ్మేందుకు సిద్ధపడటం లేదు. పిల్లల చదువులు, అప్పుల భారం, ఇతరత్రా ఆర్ధిక అవసరాల నిమిత్తం తప్పని పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే తమ భూములను విక్రయిస్తున్నారు.
రహదారుల అనుసంధానం
65వ నెంబరు జాతీయరహదారిపై ఉన్న పరిటాల విజయవాడకు 30 కిలోమీటర్లు, కృష్ణానదికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), ఇన్నర్ రింగు రోడ్డు (ఐఆర్‌ఆర్)కు మధ్యలో ఉంటుంది. నాణ్యత కల్గిన రోడ్డు మెటల్, బిల్డింగ్ కంకర పుష్కలంగా దొరుకుతుంది. ఇప్పటికే పరిటాల పరిధిలో లైట్ వెయిట్ బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉంది. రెండు భారీ ఆయిల్ బంకులున్నాయి. మరో బంకు నిర్మాణంలో ఉంది. దొనబండ వరకు జాతీయరహదారి వెంబడి పలుసంస్థలు, కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఆధ్వర్యంలో కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న బయో ఎనర్జీ ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి.
రవాణాకు కీలకంగా కార్గో టెర్మినల్
పరిటాల గ్రామ రెవెన్యూ పరిధిలో రీ సర్వే రికార్డుల ప్రకారం 6,187 ఎకరాల భూమి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎర్రుపాలెం-అమరావతి రైల్వే లైను, స్టేషన్ కోసం ఈ గ్రామ పరిధిలో ప్రభుత్వం 75 ఎకరాలు తీసుకోనుంది. ఈ మార్గంలో పరిటాల అతిపెద్ద స్టేషన్ అని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీనికితోడు సరుకు రవాణాకు సంబంధించి రైల్వే లైనుకు అనుసంధానంగా భారీ కార్గో టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా.. రోడ్డు, జల, రైల్వే రవాణాకు సంబంధించి ఇది కీలకం కానున్నది. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోలకత్తా, ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానం చేయనున్నారు. దీంతో పరిటాల ముఖ్యమైన లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని, రాజధాని అమరావతికి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొనటంతో వెయ్యి ఎకరాలకు పైగా తీసుకుంటారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రియల్టర్లు, వ్యాపారులు, బడాబాబుల చూపు పరిటాలపై పడింది. ఈ గ్రామ పరిధిలోని భూములను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ధరకు వెనుకాడటం లేదు. అయితే ఎక్కువ మంది రైతులు భూములు అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఇంకా ధర పెరుగుతుందన్న ఆశతో ఉన్నారు.