Share News

‘రెవెన్యూ’ మేడమ్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:40 AM

జిల్లాలో ఓ రెవెన్యూ డివిజన్‌ అధికారిణి పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఇతర త్రా భూ వివాదాల పరిష్కారాలకు సంబంధించి ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి నగదు వసూళ్లకు పాల్పడుతుండటమే ఇందుకు కారణం. మంత్రులు, శాసనసభ్యుల ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా తనదైనశైలిలో పరిపాలనా వ్యవహారాలు నడుపుతూ, ముడుపుల మూటలు కావాలని ఒత్తిడి చేస్తుండటంపై బాధితులు లబోదిబోమంటున్నారు. పనితీరు మార్చుకోవాలని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నా.. ఈమెలో మార్పు రాకపోవడంతో పరిస్థితులు ఫిర్యాదుల వరకూ వెళ్లాయి.

‘రెవెన్యూ’ మేడమ్‌

డివిజన్‌ కార్యాలయంలో ఓ అధికారిణి వసూళ్లపర్వం

ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి బాహాటంగానే డిమాండ్‌

బేరాలు ఇంటి వద్ద.. వసూలు బాధ్యతలు సిబ్బందికి..

ల్యాండ్‌ కన్వర్షన్‌లో రైతుల నుంచి భారీగా డిమాండ్‌

ధ్రువీకరణ పత్రాల జారీలోనూ చేతివాటం

అధికారిణి తీరుతో విసిగిపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

పైస్థాయి అధికారులు హెచ్చరించినా మార్పులేదు..!

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత రెవెన్యూ డివిజన్‌ అధికారిగా నేరుగా నియామకం పొందిన ఓ అధికారిణి తనదైనశైలిలో డివిజన్‌ కార్యాలయంలో కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పనిచేసే ఇద్దరు డెప్యూటీ తహసీల్దార్‌ హోదా ఉన్న ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఒక ఉద్యోగి వద్దకు ఫైలు వెళ్లాక కథ మొదలవుతుంది. ఫైలుకు మోక్షం లభించాలంటే ఇంతమొత్తంలో ఇవ్వాలని ఆ ఉద్యోగి బేరాలు పెడతాడు. అంతా తాము సూచించిన విధంగా ఉంటే అ అధికారిణి ఫైలుపై సంతకం చేసేందుకు ఓకే.. అనేస్తారు. ఇటీవల కాలంలో డివిజన్‌ పరిధిలోని జాతీయ రహదారుల వెంబడి ఉన్న భూములతో పాటు ఇతర భూములను ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసేందుకు పలు అర్జీలు వచ్చాయి. ఆయా మండలాల నుంచి తహసీల్దార్లు ఈ భూములకు సంబంధించి పంపిన నివేదికలను, క్షేత్రస్థాయిలో భూములను డివిజన్‌స్థాయి అధికారి స్వయంగా పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటే అనుమతులివ్వాలి. అయితే, ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, చిన్నపాటి పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చినవారు తమ పరిధిలోని రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఉన్న భూమి విలువలో ఐదుశాతం నగదును ప్రభుత్వానికి చెల్లించాలి. అక్కడ ఇచ్చిన పత్రాలు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయానికి వచ్చిన వెంటనే రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఎంతమేర నగదు కట్టారో, అంతే మొత్తంలో తమకు ఇవ్వాలని ఘంటాపథంగా చెప్పేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ అడుగుతున్నారని, డివిజన్‌స్థాయి కార్యాలయంలో అంత పెద్దమొత్తంలో ఇవ్వలేమని అర్జీదారులు వేడుకుంటుంటే, మండలస్థాయిలో ఇచ్చే మామూళ్ల సంగతి తమకెందుకని ముఖం మీదే చెప్పేస్తున్నారు. అడిగినంత మొత్తం సమర్పించని ఫైళ్లు పెండింగ్‌లో ఉంచాలని లేదా అనుమతులు ఇవ్వకుండా తొక్కిపెట్టాలని సదరు అధికారిణి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. చేసేదిలేక ఈ అధికారిణికి సీసీగా పనిచేస్తున్న ఉద్యోగి వద్దకు రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెళ్లి ఎంతో కొంత తగ్గించుకోమని బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అధికారిణి ఇంటి వద్ద పంచాయితీ పెట్టి అక్కడే బేరాలు కుదుర్చుకుంటున్నారు. బేరాలు కుదిరిన ఫైళ్లకు ఒకటీ, రెండురోజుల్లో అనుమతులు ఇచ్చేస్తున్నారని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బాహాటంగానే చెబుతున్నారు.

ధ్రువీకరణపత్రాల జారీలో వసూళ్లు

వివిధ కారణాలతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో తీసుకోని వారికి డివిజన్‌స్థాయి కార్యాలయంలో జారీ చేస్తారు. ఎవరైనా ఈ పత్రాల జారీకోసం దరఖాస్తు చేసుకుంటే, అందుకు సంబంధించిన కారణాలు, ఎంతమేర లబ్ధి చేకూరుతుంది, తదితర విషయాలపై కార్యాలయ సిబ్బంది, అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ పత్రాలు జారీచేస్తే పెద్దమొత్తంలో ప్రయోజనం కలుగుతుంది కాబట్టి, తమకు కూడా నగదు ఇవ్వాలని అర్జీదారులకు బాహాటంగానే చెప్పేస్తున్నారు. దీంతో రెండు, మూడు మండలాలకు చెందిన అర్జీదారులు నేరుగా జిల్లాస్థాయి అధికారికి ఈ అంశంపై ఫిర్యాదులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి.. 20 రోజుల క్రితం ఈ డివిజన్‌స్థాయి అధికారిని తన కార్యాలయానికి పిలిపించి పనితీరు మార్చుకోకుంటే ఇబ్బందులు పడతావని హెచ్చరించారు. ఈ పరిణామం అనంతరం ఒకటీ, రెండు రోజుల పాటు సవ్యంగా పనిచేసిన ఈ అధికారి మళ్లీ పాతపద్ధతిలోకి వెళ్లిపోయారని రెవెన్యూ అధికారులు, సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఈ అధికారి తీరుపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు.

ఓ మంత్రి హెచ్చరిస్తే.. మరో మంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదు

రెవెన్యూ డివిజన్‌ అధికారిణి వసూళ్లపర్వం పతాకస్థాయికి చేరడంతో కొందరు అధికార పార్టీ నాయకులు ఓ మంత్రి వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొంతకాలం ఓపికపట్టిన మంత్రి ఈ అధికారిణి తీరు మారకపోవడంతో తన కార్యాలయానికి పిలిపించి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో ఈ అధికారిణి పొరుగున ఉన్న జిల్లాలోని మంత్రి వద్దకు వెళ్లి.. తనను ఇబ్బందులు పెడుతున్నారని, తనకు అండగా ఉండాలని చెప్పి వచ్చారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ అంశం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ప్రజాపయోగ అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి రైతులకు పరిహారం విడుదలచేసే అంశంలోనూ ఈ అధికారిణి సాచివేత ధోరణి వ్యవహరిస్తుండటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Apr 27 , 2025 | 12:40 AM