వెలవెలా..!
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:54 AM
బంగారం.. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. రూ.లక్ష దాటేసి అటు వినియోగదారులను, ఇటు షాపుల యజమానులను షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాదిలో ఏకంగా 20 సార్లు ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించిన బంగారం.. చిన్న వ్యాపారులను మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలో వద్దోనని సామాన్యులు ఆలోచనలో పడుతుంటే, కొనుగోళ్లు లేక వ్యాపారులు దిగాలు పడిపోతున్నారు.
రూ.లక్ష దాటిన బంగారంతో వ్యాపారాలు కుదేలు
ఖాళీగా కనిపిస్తున్న గోల్డ్ షాపులు
కొనేవారు లేక యజమానుల దిగాలు
ఇక కొనలేమంటున్న సామాన్య వినియోగదారులు
వారంలో అక్షయ తృతీయ.. కష్టమేనంటున్న వ్యాపారులు
(ఇబ్రహీంపట్నం, ఆంధ్రజ్యోతి) : 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,135కు, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,900కు చేరుకోవడంతో జిల్లాలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. 2020 నాటి ధరలతో పోలిస్తే ఈ ఐదేళ్లలో బంగారం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ధరలు పెరుగుతూ వచ్చా యి. పెరుగుతున్న ఈ ధరలు పసిడి ప్రియులను, మధ్య తరగతి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో వినియోగదారులు 24, 22 క్యారెట్లకు బదులు 18, 14 క్యారెట్ గోల్డ్ జువెలరీపై మొగ్గుచూపే పరిస్థితులు నెలకొంటున్నాయి. పెరిగిన ధరలతో కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం 20 సార్లు ఆల్‌టైమ్ రికార్డులను తాకి రూ.లక్ష దాటేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడమే ఇందుకు కారణం. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా డాలర్ బలహీన పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.1.23 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదంటున్నారు.
చిన్న షాపులకు సంకటమే..
పసిడి పరుగు చిన్న షాపుల యజమానులకు సంకటంగా మారింది. ధరలు అనూహ్యంగా రూ.లక్ష దాటడంతో బంగారం గిరాకీ బాగా తగ్గింది. సగానికి సగం వ్యాపారం తగ్గిందంటున్నారు. ఇప్పుడు పెరిగిన ధరలతో చిన్నచిన్న పట్టణాల్లో ఉన్న దుకాణాలు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అక్షయ తృతీయకు, పండుగలకు బడా బంగారం షాపుల వారు ఆఫర్లు పెట్టడంతో చాలామంది వాటివైపు వెళ్తున్నారని, ఇప్పుడు పెరిగిన ధరలు వ్యాపారాలపై పడుతున్నాయంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొండపల్లి, మైలవరం, జి.కొండూరు, తిరువూరు, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, విస్సన్నపేట, పెనుగంచిప్రోలులోని బంగారం దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.
వారంలో అక్షయ తృతీయ
ఈనెల 30న అక్షయ తృతీయ. ఆరోజు ఎంతో కొంత బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ధర రూ.లక్ష దాటడం, వారంలో ధర ఎంత పెరుగుతుందోనని పసిడి ప్రియులు, సామాన్య మధ్యతరగతి వారు ఆందోళన చెందుతున్నారు. చాలామంది అక్షయ తృతీయకు బంగారం కొనకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచనలో పడ్డారు.
పెట్టుబడి పెట్టలేకపోతున్నాం.
బంగారం పెరుగుదలతో మాకు పెట్టుబడి భారం పడుతోంది. పైగా పెరిగిన ధరలతో కొనే వారు లేక నగదు రొటేషన్ కావట్లేదు. ఇలా పెరుగుతూ ఉంటే మరింత నష్టం తప్పదు. నష్టాలు వస్తే బంగారం షాపులు మూతపడటం ఖాయం. బంగారం ధరలు పెరుగుతున్నా జనం ఎంతో కొంత బంగారం కొంటున్నారే తప్ప వెండివైపు వెళ్లట్లేదు.
- కుక్కడపు సతీష్‌కుమార్, జ్యూయలరీ షాపు యజమాని
మాకు అందనంటోంది..
బంగారం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అందనంటూ పరుగెడుతోంది. బంగారం కొనే పరిస్థితి లేదు. ఒకప్పుడు బంగారం కొని దాచుకుందాం అనుకునే వాళ్లం. ఇప్పుడు ఇక అది సాధ్యపడే పనికాదని మిన్నకుంటున్నాం. బంగారం కొనడమంటే ఓ కలగా అనిపిస్తుంది. ధరలు తగ్గితే తప్ప బంగారం కొనలేం. - కె.ఆదిలక్ష్మి, విస్సన్నపేట