గొల్లపూడిలో క్లోవర్ లీఫ్
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:34 AM
16, 6వ నెంబర్ జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట గొల్లపూడిలో ‘క్లోవర్ లీఫ్’ జంక్షన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట క్లోవర్ లీఫ్ లేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ సర్వే తెలియజేయడంతో అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ 6 వరసల విస్తరణకు డీపీఆర్
గొల్లపూడి వద్ద క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదన
ఇంతకుముందు రింగ్ జంక్షన్ ఏర్పాటు చేయాలని సర్వే
తెరపైకి క్లోవర్ లీఫ్ రావడంతో గొల్లపూడి ట్రాఫిక్‌కు రిలీఫ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65ను ఆరు వరసలుగా విస్తరించటానికి డీపీఆర్ రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో.. గొల్లపూడిలో విజయవాడ వెస్ట్ బైపాస్ అనుసంధానం అయ్యేచోట క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రింగ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని ఎన్‌హెచ్ అధికారులు ఇంతకుముందే నిర్ణయించారు. ఈ రింగ్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై కన్సల్టెంట్‌ను కూడా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్-విజయవాడ 6 వరసల విస్తరణకు సంబంధించి డీపీఆర్ రూపకల్పన జరుగుతుండటంతో క్లోవర్ లీఫ్ ప్రతిపాదన ముందుకొచ్చింది.
రింగ్ పోయె.. క్లోవర్ లీఫ్ వచ్చే..
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు.. చిన్న అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్-16 నుంచి మర్లపాలెం, గన్నవరం, కొండపావులూరు, నున్న, జక్కంపూడి, గొల్లపూడి అవుటర్ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెం మీదుగా కాజ చేరుకుని అక్కడ ఎన్‌హెచ్-16కు అనుసంధానమవుతుంది. ఇది గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్-65ను క్రాస్ చేస్తుంది. ఇక్కడ ఎన్‌హెచ్-65పై ఆర్‌వోబీ వెళ్తుంది. ఇక్కడ గతంలో జరిగిన తప్పిదం కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విశాఖపట్నం, ఏలూరు నుంచి చిన అవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్లాలంటే ఆర్‌వోబీ పక్క నుంచి కిందకు దిగి.. గొల్లపూడి వెళ్లి అక్కడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర టర్నింగ్ తీసుకుని ఎన్‌హెచ్-65 మీదుగా ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి కాజ, విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చే వాహనాలన్నీ విజయవాడ వెళ్లాలంటే గొల్లపూడి ఆర్‌వోబీ పక్క నుంచి దిగి ఇబ్రహీంపట్నం రింగ్‌కు వెళ్లి ఎన్‌హెచ్-65 మీదుగా వెనక్కి రావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొద్దికాలం కిందట ఎన్‌హెచ్ అధికారులు గొల్లపూడి జంక్షన్ వద్ద ఒక రింగ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రింగ్ జంక్షన్ కోసం కన్సల్టెంట్‌తో సర్వే చేయించారు. దీనివల్ల గొల్లపూడి దగ్గర బైపాస్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు కానీ, దిగువన ఉన్న ఎన్‌హెచ్-65పై రాకపోకలు సాగించే వాహనాలు బైపాస్ ఎక్కాలన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాహనాలు కూడా ఇటు గొల్లపూడి సెంటర్, అటు ఇబ్రహీంపట్నం వెళ్లకుండానే రింగ్ జంక్షన్ మీదుగా అక్కడిక క్కడే ఎటు కావాలన్నా వెళ్లే వీలుంటుంది. ఈ రింగ్ జంక్షన్‌కు పెద్దగా భూ సేకరణ కూడా అవసరం లేదని ఎన్‌హెచ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రింగ్ జంక్షన్ పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదనేది నిపుణుల మాట. కనీసం సగం క్లోపర్ లీఫ్ జంక్షన్ అయినా ఏర్పాటు చేయాల్సిందేనని వారు ప్రతిపాదిస్తున్నారు. అయితే, దీనికి కూడా భూసేకరణ తప్పదని ఎన్‌హెచ్ వర్గాలు భావించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నాయి. కాగా, అనూహ్యంగా సగం క్లోవర్ లీఫ్ జంక్షన్ ప్రతిపాదన పక్కకుపోయి పూర్తిస్థాయి క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను ఏర్పాటుచేసే పరిస్థితి ఏర్పడింది.
ఎన్‌హెచ్-65 ఆరు వరసల ప్రతిపాదన నేపథ్యంలో..
ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ వరకు ఎన్‌హెచ్- 65ను ఆరు వరసలుగా విస్తరించాలని నిర్ణయించటమే కారణం. డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ కూడా వేగంగా శ్రీకారం చుట్టడంతో క్లోవర్ లీఫ్ జంక్షన్ అంశంపై ఎన్‌హెచ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెండు భారీ జాతీయ రహదారులు అనుసంధానమయ్యేచోట, అందునా ఆరు వరసలుగా క్రాస్ అవుతున్న దగ్గర కచ్చితంగా క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను అభివృద్ధి చేయకపోతే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజధానికి సమీపంలో ఇలాంటి ట్రాఫిక్ తలనొప్పులు మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో 6 వరసల విస్తరణ డీపీఆర్‌లో క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఈ జంక్షన్ ఏర్పాటు చేయాల్సి వస్తే భూ సేకరణ తప్పదు. గొల్లపూడిలో అత్యంత ఖరీదైన భూములను సేకరించాల్సి ఉంటుంది.