Share News

రూ.257.14 కోట్లు కావాలి

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:10 AM

జిల్లాలో టిడ్కో ఇళ్ల పనుల్లో కదలిక మొదలైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలై, వైసీపీ హయాంలో నిలిచిపోయిన మిగులు పనులను పూర్తి చేయటానికి రూ.257.14 కోట్ల నిధులు కావాలని యంత్రాంగం అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి తెలియజేసింది.

రూ.257.14 కోట్లు కావాలి
జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లు

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అంచనాలు

పనులకు రూ.220 కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.36 కోట్లు

గతంలో టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

వైసీపీ హయాంలో ఐదేళ్లు మూలనపడిన భవనాలు

కూటమి ప్రభుత్వ రాకతో ఇన్నాళ్లకు మళ్లీ కదలిక

30 శాతం మిగులు పనులకు అంచనాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లావ్యాప్తంగా నాలుగు పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను మూడొంతులకు కుదించేసింది. కేవలం టెండర్లు పూర్తయ్యి.. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వాటినే అలా ఉంచింది. పనులను కూడా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఐదేళ్లుగా లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లను ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించుకుంది. మిగులు పనులు పూర్తి చేయటానికి బడ్జెట్‌ ఎంత కావాలో నిర్దేశించింది. ఈ విషయాన్ని ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి కాంట్రాక్టర్ల బకాయిలతో పాటు మిగులు పనులు పూర్తి చేయటానికి తగిన బడ్జెట్‌ కేటాయింపులు జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు

జక్కంపూడిలో టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థ ఎఫ్‌సీసీకి రూ.13.38 కోట్లు, తిరువూరు, జగ్గయ్యపేట (గురుకుల పాఠశాల-1), నందిగామలోని హనుమంతపాలెంలో ఇళ్లు నిర్మిస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.1.46 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. జగ్గయ్యపేట (గురుకుల పాఠశాల-2)లో పనులకు ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.18.22 కోట్లు చెల్లించాలి. జగ్గయ్యపేట (గురుకుల పాఠశాల-ఆర్‌టీ)లో ఇళ్లను ఐజేఎం సంస్థ చేపట్టగా, రూ.3.21 కోట్లు చెల్లించాలి. మొత్తంగా జిల్లాలో కాంట్రాక్టర్లకు రూ.36.27 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను చెల్లించి అదనంగా రూ.220.86 కోట్లు ఉంటే ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయి.

బడ్జెట్‌ అవసరం

జిల్లావ్యాప్తంగా టిడ్కో ఇళ్ల మిగులు పనులు పూర్తి చేయటానికి రూ.257.14 కోట్ల బడ్జెట్‌ కావాలి. జక్కంపూడిలోని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి రూ.141.50 కోట్లు అవసరం. దీని మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.442.13 కోట్లు కాగా, రూ.314.01 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. మిగులు పనులకు రూ.128.12 కోట్లు మాత్రమే ఉన్నా.. కాంట్రాక్టర్‌ బకాయిలతో కలిపి రూ.141.50 కోట్లు అవసరం అవుతాయి. జగ్గయ్యపేట టిడ్కో ఇళ్లకు రూ.89.97 కోట్లు, నందిగామ టిడ్కో ఇళ్లకు రూ.6.96 కోట్లు, తిరువూరులోని టిడ్కో ఇళ్లకు రూ.18.70 కోట్ల మేర నిధులు అవసరం.

టిడ్కో ఇళ్ల పరిస్థితి ఇదీ..

జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 11,520 టిడ్కో ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. 300 చదరపు అడుగుల ఇళ్లు 3,984, 365 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 2,544, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 4,992 ఉన్నాయి. 70.08 శాతం పురోగతి ఉంది. నగరంలో మూడు నియోజకవర్గాలకు సంబంధించి జక్కంపూడిలో 6,576 ఇళ్లకు శ్రీకారం చుట్టారు. వీటి పనుల్లో 71.22 శాతం పురోగతి ఉంది. జగ్గయ్యపేటలో 3,168 ఇళ్ల నిర్మాణ పనులకు గాను 73 శాతం, నందిగామలో 240 ఇళ్ల నిర్మాణాలకు గాను 62 శాతం, తిరువూరులో 1,536 ఇళ్లకు గాను 74.10 శాతం చొప్పున పురోగతిలో ఉన్నాయి. 30 శాతం పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేస్తేనే లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకునే అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 19 , 2025 | 01:10 AM