Share News

ఉమ్మడి కృష్ణాకు 1,213 పోస్టులు

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:36 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మెగా డీఎస్సీ-2025 ద్వారా మొత్తం 1,213 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఉమ్మడి కృష్ణాకు 1,213 పోస్టులు

మెగా డీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. నేడే నోటిఫికేషన్‌

ప్రభుత్వ, జడ్పీ, ఎంఈపీ, మునిసిపల్‌ స్కూళ్లలో 1,208 పోస్టులు

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలో 5 పోస్టుల భర్తీ

ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగుల హర్షాతిరేకాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మెగా డీఎస్సీ-2025 ద్వారా మొత్తం 1,213 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 1,208 ఉపాధ్యాయ పోస్టులు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలల విభాగంలో 5 ఉపాధ్యాయ పోస్టులను కలిపి మొత్తం 1,213 పోస్టులకు అవకాశం కల్పించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ, జిల్లా పరిషత, మండల పరిషత, మునిసిపల్‌ పాఠశాలల్లో పనిచేసేందుకు జారీ చేసిన 1,208 పోస్టుల్లో లాంగ్వేజీ-1 (తెలుగు)- 39 పోస్టులు, హిందీ- 25 పోస్టులు, ఇంగ్లీషు- 93 పోస్టులు, గణితం- 52 పోస్టులు, ఫిజికల్‌ సైన్స్‌- 54 పోస్టులు, బయాలజికల్‌ సైన్స్‌- 142 పోస్టులు, సోషల్‌- 135 పోస్టులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌- 123 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) టీచర్లు- 545 పోస్టుల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ జారీ కానుంది. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఇంగ్లీషు- 1, ఫిజికల్‌ సైన్స్‌- 1, బయాలజికల్‌ సైన్స్‌- 1, ఎస్‌జీటీలు- 2 చొప్పున నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

ఐదేళ్ల కల నెరవేరిన వేళ

ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా నిరుద్యోగులుగా ఉన్న బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఐదేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కిందటి వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి నిరుద్యోగుల ఆగ్రహానికి గురైంది. సరిగ్గా ఎన్నికల ముందు ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపి గత ఏడాది ఫిబ్రవరి 9న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు కేవలం 107 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చింది. హడావిడిగా నోటిఫికేషన్‌ ఇవ్వటంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా అభ్యర్థులకు అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కాగా, ఎన్నికల్లో కూటమి పార్టీలు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. కిందటి వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 107 పోస్టుల కంటే పది రెట్లు ఎక్కువగా 1,213 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ను ఇవ్వనుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము పరీక్షలకు సన్నద్ధం కావటం కోసం ప్రభుత్వం కోచింగ్‌ ఇప్పించాలని కోరుతున్నారు.

మే 15 వరకు దరఖాస్తులు

ఉపాధ్యాయ అభ్యర్థులు మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు కూడా అదే సమయంలో చెల్లించాలి. మే 20న మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 30న హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని, జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండు రోజులకే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఏడు రోజులకు తుది కీ, ఆ తర్వాత ఏడు రోజుల తర్వాత మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు.

Updated Date - Apr 20 , 2025 | 12:36 AM