ఔరా..చైత్రదీపిక!
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:57 PM
పదిహేనేళ్ల వయసులోనే స్కేటింగ్‌లో ప్రతిభ కనబరిచి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది నగరానికి చెందిన చైత్రదీపిక. రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ద్వారా నగరపాలక సంస్థకు చెందిన ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తూ ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అనేక టోర్నీలు, చాంపియన్ షిప్‌లలో 47 పతకాలు (16 పసిడి, 16 రజత, 15 కాంస్య) సాధించి అందరితో ఔరా అనిపించింది.
స్కేటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ పతకాలతో జైత్రయాత్ర
విజయవాడ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): చైత్రదీపిక కుటుంబం ఇదివరకు విశాఖలో ఉండేవారు. ఆమెకు ఐదేళ్ల వయసులో బాలల దినోత్సవం సందర్భంగా శివాజీ పార్క్ కు వెళ్లారు. అక్కడ స్కేటింగ్ పోటీలను చూసి దీపిక ఆక ర్షితురాలైంది. ఆసక్తిని గమనించిన కోచ్ పి.సత్యనారా యణ(సత్యం), చిట్టిబాబు తల్లిదండ్రుల పోత్సహంతో ఆమెకు శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో ఆమె తన ప్రతిభ కనభరుస్తూ జిల్లా స్థాయిలో అనేక పతకాలు గెలుచుకుంది. కొంతకాలం తర్వాత ఆమె తల్లిదండ్రులు పీఆర్ సతీష్, లలితాదేవి వృత్తిరీత్యా విజయవాడకు వచ్చారు. ఇక్కడ స్కేటింగ్‌లో ఇండియాకు కోచ్‌గా ఉన్న పంచాడ సత్యనారాయణ దగ్గర మెళ కువలు నేర్చుకుంది. చైత్రదీపిక స్కేటింగ్ రింగ్‌లోనే కాదు తరగతి గదిలోనూ ప్రతిభావంతురాలే. ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఆమె తరగతిలోనూ టాప్- 10లో ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట
2021లో మొహాలీలో 59వ జాతీయ సబ్‌జూనియర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్, పెయిర్ స్కేటింగ్‌లో బంగారు, ప్రిసిషన్, షో గ్రూప్ స్కేటింగ్ విభాగంలో కాంస్య పతకాలు సాధించింది. 2022లో బెంగళూరులో 60వ జాతీయ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకం, 2023 చంఢీగఢ్‌లో అండర్-14 స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, ప్రీ స్టైల్ విభాగంలో మరొక బంగారు పత కం సాధించింది. అదే ఏడాది అక్టోబరులో చైనాలో 19వ ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ అండర్-14 విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పసిడి పతకం సాధించి దేశానికి పేరు తెచ్చింది. గత నెలలో అంతర్జాతీయ స్థాయి తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి పెయిర్ స్కేటింగ్ విభాగంలో ఏడు దేశాల క్రీడాకారులతో పోటీపడి బంగారు పతకం సాధించింది. ఇన్‌లైన్ విభాగంలో కాంస్య, కపుల్ డ్యాన్స్ విభాగంలో రజత పతకం సాధించింది. చైత్రదీపిక రోజూ ఎనిమిది గంటలు సాధన చే స్తుందని, చదువుతో పాటు స్కేటింగ్‌లో రాణించడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు.