చంద్రబాబు స్ఫూర్తితో పాడిరైతులకు సేవ
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:39 AM
నాయకుడిగా ప్రజలకు సేవంలందించడంలో క్యారెక్టర్, క్రెడిబిలిటీ, క్రియేటివిటీ ముఖ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితోనే పాడిరైతులకు సేవలందిస్తున్నానని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
హనుమాన్‌జంక్షన్‌రూరల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): నాయకుడిగా ప్రజలకు సేవంలందించడంలో క్యారెక్టర్, క్రెడిబిలిటీ, క్రియేటివిటీ ముఖ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితోనే పాడిరైతులకు సేవలందిస్తున్నానని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. వీరవల్లిలోని ప్రాజెక్ట్ కామధేను(పాలఫ్యాక్టరీ)లో బుధవారం శ్రీసీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, కలశాభిషేక కుంభసంప్రోక్షణ కార్యక్రమాలను శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో చైర్మన్ దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘34 ఏళ్లుగా చంద్రబాబునాయుడుతో రాజకీయంగా ప్రయాణిస్తున్నా. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయన స్ఫూర్తితోనే రైతులకు సేవలందిస్తున్నా. ఆయన మనసెరిగే సమైక్యాంధ్ర ఉద్యమం, రైతు ఉద్యమాలు చేశా. ఆయన చేతుమీదుగానే కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ పదవి తీసుకున్నా. రాజకీయ ప్రయాణం వదలి యూనియన్ అభివృద్ధికి పని చేయాలనే ఆయన మాటలనే వేదంగా భావించి యూనియన్‌ను అభివృద్ధి చేశా. పాడిరైతు సంక్షేమమే ధ్యేయంగా పాలకవర్గంతో కలిసి ప్రయాణం చేశా. కరోనా, బుడమేరు వరద లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పాలసేకరణ ధర పెంచుతూ, 3 విడతలుగా బోన్‌సలను చెల్లిస్తూ టర్నోవర్‌ను రూ.1300 కోట్లకు పెంచాం. ఇది పాడిరైతులందరి సహకారంతోనే సాధ్యమైంది.’ అని చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. తదనంతరం దేవస్థాన నిర్మాణ స్థపతికి, అత్యధిక బోనస్ సాధించిన పాల సంఘాలకు బోనస్ చెక్కులను చినజీయర్‌స్వామి చేతులమీదుగా పంపిణీ చేశారు. లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు, గజల్ శ్రీనివాస్, గొట్టిపాటి శివరామకృష్ణ ప్రసాద్, నూతక్కి వేణు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావు, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పాలకవర్గ సభ్యులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
దేశానికి అన్నపూర్ణగా ఏపీని నిలపాలి: త్రిదండి చినజీయర్‌స్వామి
మేలుజాతి వంగడాలతో సారవంతమైన పంటలతో దేశానికి అన్నపూర్ణగా నిలచిన ఆంధ్రప్రదేశ్ కొంత కాలంగా దిగజారుతోంది. రైతన్నలందరూ కలిసికట్టుగా నేల సారం తగ్గకుండా మేలు జాతి పంటలతో మొదటిస్థానం సాధించాలి.’ అని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు. అధిక దిగుబడుల కోసం ఎరువులు అధిక మోతాదులో వినియోగించకుండా సారవంతమైన విత్తులతో మంచి పంట పండించాలని సూచించారు. పాడిరైతులకు అత్యధిక ధర చెల్లిస్తూ చలసాని ఆంజనేయులు సారధ్యంలోని కృష్ణా మిల్క్ యూనియన్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. విదేశాల్లో స్థిరపడిన వారు తప్పనిసరిగా మూలాలను చేసుకోవాలని, ప్రతి సంవత్సరం క్షేత్రస్థాయిలో పాడి-పంటలను పరిశీలించాలని సూచించారు.