కొనుగోలు కేంద్రం లేక అవస్థలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:38 AM
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించటం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.
ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
మద్దతు ధర కంటే తక్కువకు మొక్కజొన్నను కొంటున్న దళారులు.. బస్తాకు రూ.150 నష్టపోతున్న రైతులు
(ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు): మొక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించటం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో బస్తాకు రూ.150 వరకు నష్టపోతు న్నారు. తోట్లవల్లూరు మండలంలో నాలుగు వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగ యింది. గత ఏడాది వరదలు వచ్చి వాణిజ్య పంటలను కోల్పోవడంతో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. పంట తయారైన చేలల్లో 20 రోజుల నుంచి కండెలను కోసి యంత్రం ఆడించి గింజలను ఆరబెట్టి ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,225 మద్దతు ధరను ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.2,100కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.2,050కు కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఏటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది ఇంత వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. వరదలతో పంటలను కోల్పోయి మొక్కజొన్నను సాగుచేస్తే మద్దతు ధర లభించక నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.