చారిత్రక ఘట్టాల గుట్టు తెలపండి
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:10 AM
విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే బ్రిడ్జిలు, వంతెనలపై ‘భారతీయ రైల్వే 172వ ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ‘కాఫీ టేబుల్ బుక్’ను తీసుకురానున్నది. విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత ఎం. మండ్రూపకర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇందుకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలను ఆసక్తిపరులు పంపించాల్సిందిగా కోరారు.
రైల్వేస్టేషన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే బ్రిడ్జిలు, వంతెనలపై ‘భారతీయ రైల్వే 172వ ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ‘కాఫీ టేబుల్ బుక్’ను తీసుకురానున్నది. విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత ఎం. మండ్రూపకర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇందుకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలను ఆసక్తిపరులు పంపించాల్సిందిగా కోరారు. ఈనెల 30 లోగా ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా పంపించవచ్చునని తెలిపారు. సీటీబీ.విజెడ్‌ఏఎ్‌సఈఆర్ అట్‌ది రేట్ ఆఫ్ జిమెయిల్.కామ్‌లో గానీ, విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయం ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం, గాంధీనగర్ విజయవాడకు గానీ వివరాలను పంపాలన్నారు. కాఫీ టేబుల్ బుక్ డిజిటల్ ఫార్మాట్‌లో ఉంటుందని, వంతెనలు, బ్రిడ్జిల కథలు, విజువల్స్, వాటియొక్క వారసత్వం, చారిత్రక కథనాలు రాబోయేతరాలకు అందుబాటులో ఉండేందుకు భద్రపరుస్తామని తెలిపారు. హేవలాక్ వంతెన, గోదావరి వంతెన, కృష్ణానదిపై వంతెన, పెన్నానదిపై వంతెన వంటి చారిత్రాత్మక, అద్భుత నిర్మాణాలకు ప్రతీకగా విజయవాడ రైల్వే డివిజన్‌లో 225 బ్రిడ్జిలు, వంతెనలు ఉన్నాయన్నారు. వీటిలో ఇంజనీరింగ్ అద్భుతాలే కాకుండా, సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉందన్నారు. భారతీయ రైల్వే ప్రగతికి నిశ్శబ్ధ సాక్షులుగా ఇవి ఉన్నాయని నుస్రత ఎం. మండ్రూపకర్ వివరించారు. విజయవాడ డివిజన్‌లోని ప్రయాణికులు, విద్యార్థులు, రైల్వే ఔత్సాహికులు, చరిత్రకారులు, మీడియా నిపుణులు, ఈ ‘కాఫీ టేబుల్ బుక్’ను రూపొందించేందుకు సహకరించాలని కోరారు. చరిత్రను ప్రత్యక్షంగా చూసిన వృద్ధుల వ్యక్తిగత కథనాలు, హైరిజల్యూషన్ ఛాయాచిత్రాలు, అరుదైన వాస్తవ కథనాలు పంపించవచ్చునని, పాఠశాల విద్యార్థులు, కవితలు, డ్రాయింగ్‌లు, కథలు, వారి అనుభవాలు, లేదా ఊహలను హైలెట్ చేయవచ్చునని తెలిపారు.