Share News

రహదారులు రక్తసిక్తం

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:01 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా రహదారులు శుక్రవారం రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతిచెందారు. ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం నలుగురు కన్నుమూయడం విషాదకరం. క్రైస్తవ శ్రమదీక్ష తీసుకుని కాలినడకన గుణదల బయల్దేరిన ఇద్దరు భక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఇక ప్రసాదంపాడులో లారీ బీభత్సం సృష్టించగా, డ్రైవర్‌తో పాటు పాదచారి మృతిచెందారు. ఘటనాస్థలాల్లో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు కాగా, స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

రహదారులు రక్తసిక్తం
ప్రసాదంపాడులో బీభత్సం సృష్టించిన లారీ ఇదే..

ఉమ్మడి కృష్ణాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. పదిమంది మృతి

ఒక్క జగ్గయ్యపేటలోనే మూడు ప్రమాదాలు

ప్రసాదంపాడులో డ్రైవర్‌కు గుండెపోటు.. లారీ బీభత్సం

పాదచారిపైకి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే మృతి

గుణదలకు కాలినడకన బయల్దేరిన ఇద్దరు భక్తులు

మార్గంమధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం

ఆటో ప్రయాణికులను కాపాడి వాహన డ్రైవర్‌ కన్నుమూత

స్వగ్రామాల్లో మిన్నంటిన రోదనలు

ప్రసాదంపాడులో లారీ బీభత్సం.. లారీడ్రైవర్‌కు గుండెపోటు.. పాదచారి మృతి

విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడులోని జాతీయ రహదారిపై మృత్యువు వేర్వేరు రూపాల్లో ఇద్దరిని బలి తీసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో లారీ బీభత్సం సృష్టించింది. గుండెపోటుతో లారీడ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఓ పాదచారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. పామర్రు మండలం నిమ్మకూరుకు చెందిన జంపాని రామకృష్ణ (54) లారీ డ్రైవర్‌. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌ నుంచి ఫ్లైయాష్‌ లోడుతో లారీ గన్నవరం వైపు వెళ్తోంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి వచ్చిన రామకృష్ణకు ఇన్నోటెల్‌ హోటల్‌ వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అక్కడి నుంచి లారీని అదుపు చేసుకుంటూ ప్రసాదంపాడులోని ఉప్పలబజారు వద్దకు వచ్చాడు. నొప్పి ఎక్కువ కావడంతో నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ బీభత్సం సృష్టించింది. రహదారిపై అటూ ఇటూ తిరుగుతూ వాహనదారులు, పాదచారులను భయపెట్టింది. ముందుగా రోడ్డు డివైడర్‌ను, ఆ తర్వాత పార్క్‌ చేసిన కారు, బైక్‌ను ఢీకొంది. అనంతరం ఫుట్‌పాతపై నడుచుకుంటూ వెళ్తున్న రామవరప్పాడుకు చెందిన బలుగూరి రామసాయి (18)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ట్రాఫిక్‌ పోలీసులు అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రామసాయి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. రామవరప్పాడుకు చెందిన రామసాయి ఆటోనగర్‌లో వెల్డింగ్‌ పనిచేస్తుంటాడు. టీ తాగడానికి ప్రధాన రహదారిపైకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రసాదంపాడుకు చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ.. బల్లెం వారి వీధి వద్ద కూల్‌డ్రింక్‌ తాగుదామని రోడ్డు పక్కన ఆగారు. వాహనాన్ని ఫుట్‌పాత వద్ద నిలిపి షాపు వద్దకు వెళ్లారు. ఇంతలో లారీ దూసుకొచ్చింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

క్రీస్తు శ్రమదీక్షలో దారుణం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం

గుడ్‌ఫ్రైడే సందర్భంగా శ్రమదీక్ష విరమించడానికి గుణదలకు బయల్దేరిన ఇద్దరిని గుర్తుతెలియని వాహనం బలి తీసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రికి చెందిన పసుమర్తి భాస్కరరావు (48), రుద్రపోగు వెంకటేశ్వర్లు (39) ఏసుక్రీస్తు మాల వేసుకుని శ్రమదీక్ష ప్రారంభించారు. ఇద్దరూ కూలీలు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా గుణదల మేరీమాత ఆలయంలో ఇరుముడి సమర్పించడానికి గురువారం రాత్రి వేదాద్రి నుంచి కాలినడకన బయల్దేరారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నందిగామ రూరల్‌ మండలం అనాసాగరం ఫ్లైఓవర్‌ మీద 65వ నెంబరు జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. భాస్కరరావుకు భార్య, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా, మరో ముగ్గురు చదువుకుంటున్నారు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఆగిన లారీ ఢీకొని హైదరాబాద్‌వాసి..

జగ్గయ్యపేటలోని జాతీయ రహదారిపై తిరుమలగిరి క్రాస్‌ రోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. హైదరాబాద్‌కు చెందిన ధర్మోజు ప్రవీణ్‌కుమార్‌ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు, ప్రవీణ్‌కుమార్‌లు పనిమీద హైదరాబాద్‌ నుంచి కారులో విజయవాడ వస్తుండగా, జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆటో ప్రయాణికులను కాపాడి..

జగ్గయ్యపేటలో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నంపల్లికి చెందిన రాజు (43) ఎస్‌ఆర్‌ఎంటీ ట్రాన్స్‌పోర్టు వాహనం డ్రైవర్‌గా 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరాడు. జగ్గయ్యపేటలోని కార్యాలయంలో పనిచూసుకుని విజయవాడకు వెళ్తుండగా, ముందు వెళ్తున్న కారు టైర్‌ పంక్చరై డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దాని వెనుక ఉన్న ఆటోను ఢీ కొట్టకుండా ఉండేలా రాజు లారీ ఒక్కసారిగా పక్కకు తప్పించాడు. ఈ క్రమంలో లారీ పల్టీ కొట్టింది. ఆటోలో ఉన్న రూపన పుల్లయ్య, శివరాత్రి వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ రాజు అక్కడికక్కడే చనిపోయాడు.

డివైడర్‌ను ఢీ కొట్టి భవన నిర్మాణ కార్మికుడు..

పామర్రు-దిగమర్రు జాతీయ రహదారిపై అడ్డాడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. పామర్రుకు చెందిన ఆరేపల్లి శ్రీనివాసరావు (58) భవన నిర్మాణ కార్మికుడు. యాక్టివా మోటరు సైకిల్‌పై గుడివాడ వైపు వెళ్తుండగా, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాసరావు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై ప్రాణాలు వదిలాడు.

కారు ఢీకొని బైకర్‌..

తేలప్రోలు నుంచి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లే జాతీయ రహదారికి ఎడమ వైపు ఉన్న సర్వీసు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్‌ ఫక్రుద్దీన్‌ బాబా (51) మృతిచెందాడు. హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన బాబా తేలప్రోలు పట్టు రీలింగ్‌ కేంద్రంలో పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది.

చెట్టును బలంగా ఢీకొని..

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామ సమీపంలోని కరకట్టపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోగినేనిపాలెం గ్రామానికి చెందిన దాసి వెంకటేశ్వరరావు (42) మృతిచెందాడు. గరికముక్కు శ్రీనుతో కలిసి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం విజయవాడ వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఇంటి వస్తున్న క్రమంలో శివసిద్ధిని కుండళిని యోగాశ్రమం సమీపంలో కరకట్ట పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. శ్రీనుకు కాలు విరిగింది. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఎదురుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొని బైకర్‌..

ముందు వెళ్తున్న పాదచారిని ఢీకొని బైకర్‌ మృతిచెందిన ఘటన గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గంధం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటి సరుకులు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా, గోపాలస్వామి కుంట వద్దకు రాగానే, ముందు నడుస్తున్న పాదచారుడు నండ్రు కృష్ణయ్యను ఢీకొట్టాడు. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై మృతిచెందగా, కృష్ణయ్యకు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - Apr 19 , 2025 | 01:01 AM