Share News

హెచ్‌టీ బీటీ విత్తనాలపై అప్రమత్తం

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:55 PM

రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగవుతోంది.

హెచ్‌టీ బీటీ విత్తనాలపై అప్రమత్తం
హెట్‌ టీ పత్తి విత్తనాలు ఇవే

ఈ రకం విత్తనాలతో పర్యావరణానికి ప్రమాదం

రైతులకు అందకుండా ముమ్మర తనిఖీలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.60 లక్షల హెక్టార్లలో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగవుతోంది. వచ్చే ఖరీఫ్‌లో రైతులు భారీగా పత్తి సాగుకు సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంచనా. ఇందులో భాగంగా రైతులు పర్యావరణానికి పెనుముప్పు కలిగించనున్న హెచ్‌టీ కలిగిన బీటీ పత్తి విత్తనాలు వినియోగించకుండా చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలతో అప్రమత్తమయింది. హెచ్‌టీ పత్తి విత్తనాల ఉత్పత్తి, సాగు, అమ్మకాలను కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందటే నిషేధించింది. వీటి సాగు వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందని, నేల విషతుల్యమైపోతుందని గుర్తించి ఈ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ విత్తనాల తయారీ సమయంలోనే అడ్డుకట్ట వేస్తే రైతులకు సరపరా కాకుండా నియంత్రించవచ్చనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందాలను నియమించి తనిఖీలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఏడీఏ ఏవో స్థాయి అధికారులు వచ్చారు. ప్రస్తుతం వీరు కర్నూలు జిల్లాలో పత్తి విత్తనాల నమూనాలు సేకరిస్తున్నారు. వీరికి ఆయా మండలాల్లో ఉన్న మండల వ్యవసాయాధికారులు సహకారాలు అందిస్తున్నారు. వీరంతా బృందాలుగా ఏర్పడి కర్నూలు, నంద్యాల, ఆదోని ఎమ్మిగనూరు, కోడుమూరు, తదితర ప్రాంతాల్లో ఉన్న పత్తి విత్తనాల జిన్నింగ్‌ ఫ్యాక్టరీలు విత్తనాలు పంపిణీ చేసే కంపెనీల గోదాములు, హోల్‌సేల్‌, రీటైల్‌ డీలర్ల షాపులు, అదే విధంగా పార్సిల్‌, రవాణా కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అక్కడికక్కడ నమూనాలు సేకరించి హెర్బిసైడ్‌ ట్రైట్‌ జెన్యూ పరీక్షలు చేసి ఆ పత్తి విత్తనాల్లో హెట్‌ జెన్యూ ఉందా లేదా అని నిర్ధారిస్తున్నారు. ఇప్పటి దాకా పరీక్షించిన విత్తనాల్లో హెచ్‌టీ పత్తి విత్తనాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

కలుపు నివారణ ఖర్చులు తగ్గుతాయని..

నేలలో, పరిసరాల్లో తీవ్ర దుష్ఫలితాలు కలిగించే హెచ్‌టీ కలిగిన బీటీ పత్తి విత్తనాలను 2019లో ఉమ్మడి జిల్లాలో రైతులు వినియోగించారు. ఈ హెచ్‌టీ పత్తి విత్తనాలను సాగు చేస్తే పొలంలో కలుపు నివారణ మందులు చల్లాల్సిన అవసరం ఉండదని, దీని వల్ల కూలీల ఖర్చు తగ్గిపోతుందని రైతులు అనుకు న్నారు. ఈ రకమై ప్రచారం జరగడంతో రైతులు నిజమే అని నమ్మారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హెచ్‌టీ పత్తి విత్తనాల సాగు వల్ల పర్యావరణ పరంగా అనేక సమస్యలు వస్తున్నట్లు గుర్తించి హెచ్‌టీ పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితు ల్లోనూ రైతులను సాగు చేపట్టకుండా ఈ విత్తనాలపై నిషేధం విధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికీ కలుపు సమస్య తగ్గుతుందనే ఆలోచనతో హెచ్‌టీ పత్తి విత్తనాలను సాగుకు ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఖరీఫ్‌ సీజన్‌ మే నెలాఖరులో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో హెచ్‌టీ పత్తి విత్తనాలను సాధ్యమైనంత తొందరగా స్వాధీనం చేసుకుని రైతులకు అందకుండా చేసేందు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.

Updated Date - Apr 22 , 2025 | 11:55 PM