ఆలూరు మాజీ ఎమ్మెల్యే లోక్‌నాథ్ కన్నుమూత
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:54 AM
కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే జి.లోక్‌నాథ్(85) బుధవారం కన్నుమూశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన లోక్‌నాథ్ గోవాలో వ్యాపారం చేసేవాడు.
మచ్చలేని నేతగా గుర్తింపు
నేడు మొలగవల్లిలో అంత్యక్రియలు
ఆలూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే జి.లోక్‌నాథ్(85) బుధవారం కన్నుమూశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన లోక్‌నాథ్ గోవాలో వ్యాపారం చేసేవాడు. ఆలూరు అసెంబ్లీ స్థానం ఎస్సీ జనరల్‌గా మారడంతో అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రెడ్డి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సహకారంతో 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలూరు అభ్యర్థిగా లోక్‌నాథ్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి రంగయ్యపై 39వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ హయాంలో లోక్‌నాథ్ టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో నిస్వార్థ సేవలు అందించిన ఆయన చివరి వరకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా నిలిచారు. అప్పట్లో ఆయన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఏడాది పాటు బెడ్ రెస్ట్‌లో ఉండిపోయాడు. కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో సాధారణ జీవనం సాగించాడు. ఎక్కడికైనా సరే కాలి నడకన వెళ్లేవారు. ఎమ్మెల్యేగా కోట్లాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన చివరివరకు ప్రజా సేవకే అంకితమయ్యారు. ఆయనకు భార్య సులోచన, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే లోక్‌నాథ్ అంత్యక్రియలు గురువారం ఆలూరు మండలం మొలగవల్లిలో నిర్వహించనున్నారు.
ప్రముఖుల సంతాపం : మాజీ ఎమ్మెల్యే లోక్‌నాథ్ మృతిపై మాజీ మంత్రులు మారెప్ప, గుమ్మనూర్ జయరాం, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జీ వీరభద్ర గౌడ్, మాజీ జడ్పీటీసీ దేవేంద్రప్ప, రామ్ భీంనాయుడు, మేకల భాస్కర్, మాజీ ఎంపీపీ రామ్‌నాథ్‌యాదవ్ తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. నిస్వార్థ రాజకీయాలకు ఆయన జీవితం ఓ ఉదాహరణ అని అన్నారు.