ఇంజనీర్లపై తేనెటీగల దాడి
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:02 AM
వెల్దుర్తి మండలం రామకృష్ణాపురంలో నీరు-చెట్టు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి.

నీరు-చెట్టు పనుల్లో భారీ అక్రమాలు
తనిఖీకి వెళ్లిన విజిలెన్స్ బృందంపై తేనెటీగల దాడి
కర్నూలు/ వెల్దుర్తి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి మండలం రామకృష్ణాపురంలో నీరు-చెట్టు పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏఈఈ క్రిష్ణప్రియ, క్రిష్ణగిరి మైనర్ ఇరిగేషన్ ఏఈఈ రవి నాయక్, ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ మనోజ్‌కుమార్, గాజులదిన్నె ప్రాజెక్టు కోడుమూరు సబ్ డివిజన్ ఏఈఈ నారాయణ, కర్నూలు ఇరిగేషన్ సర్కిల్ ఏఈఈ ఆనంద్‌బాబులు గాయపడ్డారు. వీరిలో క్రిష్ణప్రియ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో వీరు చికిత్స పొందుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో మైనర్ ఇరిగేషన్, కేసీ కెనాల్ పరిధిలో రూ.కోట్ల విలువైన చెక్‌డ్యామ్ నిర్మాణాలు, పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లింపులు ఆపేసింది. కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కొందరు కుమ్మక్కై భారీ ఎత్తున భోగస్ బిల్లులు అప్‌లోడ్ చేసి నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. డోన్, బేతంచర్ల, వెల్దుర్తి, క్రిష్ణగిరి, ఆదోని, ఆస్పరి, పత్తికొండ మండలాల్లో దాదాపు రూ.11.80 కోట్లు విలువైన 138 పనులు చేయకపోయినా...చేసినట్లు రికార్డులు సృష్టించి ప్రజాధనం స్వాహాకు కుట్రపన్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన కొందరు ఇంజనీర్లు తాము ఈ పనులు చేయలేదని, తమ పేరిట ఫోర్జరీ సంతకాలతో బిల్లులు చేసుకుంటున్నారని ఫిర్యాదులు చేయడంతో నిగ్గు తేల్చమని ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. అందులో భాగంగానే విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి నేతృత్వంలో విచారణ చేపట్టారు. విజిలెన్స్, ఇంజనీర్ల బృందం వెల్దుర్తి మండలం రామకృష్ణాపురం గ్రామంలో చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిచేందుకు వెళ్లగా...అక్కడే మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడి చికిత్స పొందుతున్న ఇంజనీర్లను విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి పరామర్శించారు.