కర్నూలు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:07 AM
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం కర్నూలుకు చేరుకున్నారు
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
నేడు ఓర్వకల్లు, అహోబిలంలో పర్యటన
కర్నూలు/ఆళ్లగడ్డ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం కర్నూలుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి ప్రహ్లాదజోషికి ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, భైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీఓ సందీప్ కుమార్, గ్రీన్‌కో ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కర్నూలులోని మౌర్యఇన్ హోటల్‌కు చేరుకున్న మంత్రి రాత్రి అక్కడే బస చేశారు. జాయింట్ కలెక్టర్ బి.నవ్య కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓర్వకల్లు మండలం గుమితంతండా, పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్‌కో గ్రూప్ 2800 ఎకరాల్లో, 5,230 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంధన పునరుత్పాదక ప్రాజెక్టు ఇది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10వేల కోట్లకు పైగా గ్రీన్‌కో సంస్థ ఖర్చు చేసింది. రెండో విడత రూ.14వేల కోట్లను ఖర్చు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు గ్రీన్‌కో సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి శుక్రవారం ఈ ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం అహోబిలం చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఈ మేరకు రెండు జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి జడ్పీ పాఠశాలలో హెలీప్యాడ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.