Share News

ఉమ్మడి జిల్లా ప్రగతిలో చంద్రబాబు

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:55 PM

ఉమ్మడి జిల్లా ప్రగతిలో చంద్రబాబు

 ఉమ్మడి జిల్లా ప్రగతిలో చంద్రబాబు

కేఈ, బీవీ, ఫరూక్‌ కుటుంబాలతో బాబుకు విడదీయని బంధం

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఉమ్మడి జిల్లాను పారిశ్రామిక

కారిడార్‌గా మార్చాలనే సంకల్పం నేడు సీఎం చంద్రబాబు 75వ జన్మదినం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పొషించే విజనరీ నాయకుడు. 48 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేశారు. ప్రస్తుతం నాలుగవ పర్యాయం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబుకు ఉమ్మడి కర్నూలు జిల్లాతో విడదీయలేని రాజకీయ అనుబంధం ఉంది. కర్నూలును పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే సంకల్పం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదినం. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రగతి పథంలో, జిల్లా రాజకీయాలతో ఆయన అనుబంధంపై ప్రత్యేక కథనం.

కర్నూలు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కుటుంబాలతో సీఎం చంద్రబాబుకు విడదీయరాని అనుబంధం ఉంది. టీడీపీ ఆవిర్భావం తరువాత 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చంద్రబాబుతో కలసి జిల్లాకు చెందిన బీవీ మోహన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ పనిచేసిన సమయంలో వారి మధ్య రాజకీయ అనుబంధం పెనవేసుకుంది. 1995లో బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మంత్రివర్గంలో ఎన్‌ఎండీ ఫరూక్‌, దివంగత మంత్రి బీవీ మోహన్‌రెడ్డి పనిచేశారు. 1989లో ఎన్టీఆర్‌తో రాజకీయ విభేదాలతో టీడీపీ వీడిన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి 1998లో చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. ఆనాటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ మూడు కుటుంబాలతో చంద్రబాబుకు రాజకీయంగా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే 2024 ఎన్నికల్లో కేఈ కుమారుడు కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టికెట్‌ఇచ్చారు. దివంగత బీవీ మోహన్‌రెడ్డి కుమా రుడు బీవీ జయనాగేశ్వరరెడ్డికు ఎమ్మిగనూరు నుంచి వరుసగా మూడు పర్యా యాలు టికెట్‌ఇస్తే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో రాజకీయంగా బద్ధశత్రువులైన కేఈ, కోట్ల కుటుంబాలను రాజీచేసి ఒకే వేదికపైకి తీసుకురావ డంతో చంద్రబాబు సక్సెస్‌ అయ్యారు. కేఈ కృష్ణమూర్తి, డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రెండు కుటుంబాలు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలోనే కొనసాగుతున్నాయి. ఈ తరువాత మారిన రాజకీయ పరిణామాల వల్ల జిల్లాలో పలువురు నాయకులు అధినేతకు అత్యంత సన్నిహితులుగా మారారు.

ప్రతిపక్షంలో అధినేతకు అండగా..!

అధికారం ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, ప్రజలు అధినేత చంద్రబాబుకు అండగా నిలిచారు. 1994, 1999 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో టీడీపీని గెలిపించి అండగా నిలిచారు. 2013లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో 208 రోజులు చంద్రబాబు పాదయాత్ర చేశారు. జిల్లాలో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ.. సుంకేసులు బ్యారేజీ దాటి రాజోలి వద్ద తెలంగాణలో అడుగు పెట్టారు. పాదయాత్రలో జిల్లా ప్రజలు చంద్రబాబు బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో ఘన విజయం అందించారు. 2019లో ఘోరంగా ఓడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్‌ రాజకీయ కక్షలో భాగంగా 2023 సెప్టెంబరు 9న అక్రమ అరెస్టు చేస్తే.. 53 రోజులు వివిధ రూపాల్లో జిల్లా వాసులు అందోళనలు చేస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో రెండు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించి మీ వెంటే మేము.. అంటూ బాబు భరోసాగా నిలిచారు.

కర్నూలు ప్రగతిలో కీలక పాత్ర

ప్రగతిలో బాబు ముద్ర స్పష్టంగా కనిపించేలా కృషి చేశారు. 33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామికవాడకు గతంలో సీఎంగా ఉన్న ప్పుడే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రూ.2,800 కోట్లతో ఇండస్ట్రియల్‌ నోడ్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. విత్తన రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడానికి మోగా సీడ్‌ హబ్‌కు శ్రీకారం చుట్టారు. కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ హబ్‌ ఏర్పాటుకు పునాది రాయి వేశారు. అలా్ట్ర మెగా సోలార్‌ పవర్‌ యూనిట్‌, 5,230 మోగావాట్ల సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారు.

2,612 ఎకరాలు.. రూ.2,786 కోట్లు

సీఎం చంద్రబాబు ఆశయం మేరకు ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీ 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫేజ్‌-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పించనున్నారు. వివిధ పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

చంద్రబాబు సీఎం అయ్యాక జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. ముచ్చుమర్రి ప్రాజెక్టును పూర్తి చేశారు. అవుకు టన్నెల్‌ను పూర్తిచేసి కడప జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. హంద్రీనీవా విస్తరణ పనులు రూ.1,030 కోట్లతో చేపట్టారు. దాదాపు రూ.10 వేల కోట్లలో వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులు సహా గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లాలో రూ.690 కోట్లతో హంద్రీనీవా కెనాల్‌ విస్తరణ పనులు జిల్లాలో చేపట్టారు.

జిల్లాకు చంద్రబాబు తీసుకొచ్చిన ప్రాజెక్టులు కొన్ని

విమానాశ్రయం కోసం 2017 జూన్‌ 21న ఓర్వకల్లు సమీపంలో 1,010 ఎకరాల్లో రూ.88.50 కోట్లతో పునాది రాయి వేశారు. కేవలం 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి 2018 జనవరి 9న జాతికి అంకితం చేశారు.

ప్రపంచంలోనే తొలి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన అలా్ట్ర మెగా సోలార్‌ పవర్‌ యూనిట్‌ను ఓర్వకల్లు మండలం గని కేంద్రంగా ఏర్పాటు చేశారు. అదే మండలం గుమ్మటంతాండ, పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు)కు 2018లో బీజం వేశారు. 5,230 మెగావాట్ల సోలార్‌, విండ్‌, జల విద్యుత్‌ పవర్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

జూపాడుబంగ్లా మండలం తంగడంచకు చెందిన ఏపీ విత్తనోత్పత్తి కేంద్రానికి చెందిన 1,600 ఎకరాల్లో మెగా సీడ్‌ పార్క్‌కు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అక్కడే 2015 ఆగస్టు 17న అలా్ట్ర మెగా ఫుడ్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు.

ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో ఏపీఐఐడీసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేశారు. 2018 మే 11న ఓర్వకల్లుకు సమీపంలో జైరాజ్‌ ఇస్పాత్‌ ఐరన్‌ పరిశ్రమకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

కొలిమిగుండ్ల సమీపంలో సిమెంట్‌ పరిశ్రమకు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. అలాగే.. ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద 2,781 ఎకరాల్లో రూ.570 కోట్లతో డీఆర్‌డీవో నిర్మాణం చేపట్టారు.

ఓర్వకల్లు మండలం పాలకొనను, చింతలపల్లి, కొమ్మరోలు గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో ‘డ్రోన్‌ తయారీ పరిశ్రమ’ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:55 PM