సాంక్షేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:47 PM
నేర నియంత్రణకు బాగా కృషి చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
కర్నూలు క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నేర నియంత్రణకు బాగా కృషి చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులను సమీక్షించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ డివిజన్ల వారీగా క్రైం పార్టీ పోలీసు బృందాలను ఏర్పాటుచేసి రికవరీ పర్సంటేజీలు బాగా పెంచి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 100 పోలీసులు బాగా పనిచేయాలన్నారు. పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటించి, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా రౌడీషీటర్లను పోలీస్‌స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 4వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అడిషినల్ ఎస్పీ అడ్మిన్ హుశేన్‌పీరా మాట్లాడుతూ మహిళలపై నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేసులను ఛేదించిన పోలీసులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు ఎస్పీ అందజేశారు. సమావేశంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు బాబుప్రసాద్, శ్రీనివాసాచారి, వెంకట్రామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.