Share News

రుణం కోసం తిప్పలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:32 AM

నిరుద్యోగులు రుణం మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయినా రుణం అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. మండలంలో బీసీ, కాపు, కార్పొరేష్ల కింద 50 యూనిట్లు మంజూరయ్యాయి.

రుణం కోసం తిప్పలు
దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు(ఫైల్‌)

ఇంటర్వ్యూలు పూర్తయినా జాబితా ప్రకటించని అధికారులు

మద్దికెర, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు రుణం మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయినా రుణం అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. మండలంలో బీసీ, కాపు, కార్పొరేష్ల కింద 50 యూనిట్లు మంజూరయ్యాయి.

నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యం..

ఉద్యోగం, ఉపాధిలేని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 50 శాతం రాయితీతో రుణాలు ఇచ్చి వారు ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు ఫిబ్రవరి 21వ తేదీన ఇంటర్వ్యూలు కూడా నిర్వహిం చారు. అయితే ఇంతవరకు లబ్ధిదారుల పేర్లు ప్రచురించలేదు. మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. మద్దికెర కెనరా బ్యాంకు పరిధిలో 29 యూనిట్లు, పెరవలి గ్రామం ఏపీజీబీ బ్యాంకుకు 21 యూనిట్లు రుణాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు 674 మంది దరఖాస్తు చేశారు. అయితే 50 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికైనా స్పందించి, తమకు రుణం మంజూరు చేయించాలని కోరుతున్నారు.

నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

తమకు రుణం ఇప్పించాలంటూ దరఖాస్తుదారులు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే 674 మంది దరఖాస్తు చేసుకోగా, 50 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో ఎవరికి ఇప్పించాలో తెలియక నాయకులు సతమతమవుతున్నారు.

రాజకీయ ప్రమేయం ఉండరాదు

ప్రభుత్వం ఇస్తున్న రుణాల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండరాదు. లబ్ధిదారుల జాబిత ఆలస్యం చేయడం మంచిది కాదు. - సునీల్‌, దరఖాస్తుదారుడు

అర్హులకు ఇస్తాం

నిరుద్యోగులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. అర్హుల కు తప్పకుండా రుణాలు అందజే స్తాం. - కొండయ్య, ఎంపీడీవో, మద్దికెర.

Updated Date - Apr 22 , 2025 | 12:32 AM