మిర్చి రైతుకు నష్టాలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:40 AM
వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మిడుతూరు మండలంలో జలకనూరు, తలముడిపి, రోళ్లపాడు, ఖాజిపేట, సుంకేసుల, మిడుతూరు, చింతలపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఖరీప్‌లో1550 ఎకరాల్లో మిరప తోటలు సాగు చేశారు.
భారీగా పడిపోయిన ధరలు
మిడుతూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. మిడుతూరు మండలంలో జలకనూరు, తలముడిపి, రోళ్లపాడు, ఖాజిపేట, సుంకేసుల, మిడుతూరు, చింతలపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఖరీప్‌లో1550 ఎకరాల్లో మిరప తోటలు సాగు చేశారు. ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని భావించినా.. తెగుళ్ల బారిన పడి దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఎకరం మిరప సాగుకు రూ. లక్షకుపైగా ఖర్చు వచ్చింది. పంట దిగుబడిని మార్కెట్‌కు తీసుకువెళ్తే.. క్వింటం రూ. 11వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. ఎర్రమిర్చికి గిట్టుబాటు ధరలు లేవని రైతులు కోల్డు స్టోరేజ్‌లకు తరలిస్తున్నారు. గతేడాది గరిష్ఠంగా రూ.20వేలు ధర పలికిన ఎండు మిర్చి, ప్రస్తుతం రూ.11 వేలు కూడ దాటడం లేదు. కొందరు రైతులు ఎండు మిర్చిని ట్రాక్టర్‌లో, ఆటోలలో వేసుకుని గ్రామాలకు తిరిగి రోడ్డుపైన విక్రయిస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.