ఎనర్జీ ప్రాజెక్టు వరం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:22 AM
గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెకుతో ఉమ్మడి కర్నూలు జిల్లా రూపురేఖలు మారిపోతాయని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
మారనున్న ఉమ్మడి కర్నూలు జిల్లా రూపురేఖలు
గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు అద్భుతం
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ ఆర్థిక విధానాలు
కేంద్ర పునరుత్పాదశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
కర్నూలు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెకుతో ఉమ్మడి కర్నూలు జిల్లా రూపురేఖలు మారిపోతాయని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోందన్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మితంతండా, పాణ్యం మండలం పిన్నాపురం ప్రాంతాల్లో గ్రీన్‌కో కంపెనీ 6,680 మెగావాట్లతో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును గ్రీన్‌కో కంపెనీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహలు చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి శుక్రవారం ఉదయం ఆ ప్రాజెక్టును పరిశీలించారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు టన్నెల్, టర్బైన్స్‌ను పరిశీలించారు. అంతకుముందు ఓర్వకల్లు మండలం గని గ్రామ ప్రాంతాల్లో నిర్మించిన సోలార్ ప్రాజెక్టును రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా గ్రీన్ కో కంపెనీ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అప్పర్ డ్యాం, లోయర్ డ్యామ్, టన్నెల్‌ను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్మాణం అద్భుతమని, ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు ఇదే కావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ బైరెడ్డి శబరి, చలమలశెట్టి అనిల్ కుమార్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన రెన్యువబుల్ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఇదేనని అన్నారు. ఒకే ప్రాంతంలో సోలార్, విండ్ జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించడం గొప్పతనమన్నారు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని అటవీభూముల్లో దేశానికి గర్వకారణమైన ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని కొనియాడారు. ఓర్వకల్లు ప్రాంతం ఆర్థికవృద్ధిని పెంచుతుందని, మరిన్ని అనుబంధ పరిశ్రమలు రాబోయే అవకాశాలు ఉన్నాయనీ తెలిపారు. స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, నిల్వ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్ప త్తి ఈప్రాజెక్టు లక్ష్యమన్నారు. పర్యావరణ వనరులు దెబ్బతినకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రస్తుత భారతదేశానికి ఎంతో అవసరమని తెలిపారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం
విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పదేళ్ల క్రితం దేశంలో 18,700 గ్రామాలకు కరెంటు అన్నది తెలియదని, ఎన్టీయే ప్రభుత్వం వచ్చాక పల్లెపల్లెకు కరెంటు సౌకర్యం కల్పించామన్నారు. పీఎం సూర్యఘర్ ద్వారా పేదలకు తక్కువ చార్జిలకు విద్యుత్ విని యోగించుకునే అవకాశం తీసుకువచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుంచి బయట పడుతున్నారని, ఆ దిశగా ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. నీటిని మళ్లీ విని యోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం గొప్ప విధానమని కొనియాడారు. ఇలాంటి యూనిట్ల వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందని గుర్తు చేశారు. ఓర్వకల్లు మండలంలోని గ్రీన్‌కో కంపెనీ నిర్మాణం చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు 60 సంవత్సరాలు పైగా పని చేసే సామర్థ్యం ఉందని త్వరలోనే పూర్తి సామర్థ్యంతో పని చేస్తుందని వివరించారు. కేవలం సోలార్ విద్యుత్‌పైనే ఆధారపడకుండా గాలిమర విద్యుత్, నీటిని ఉపయోగించుకుని విద్యుత్ వినియోగించుకోవాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4వేల మెగా వాట్ల సౌర విద్యుత్, వెయ్యి మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. గ్రీన్‌కో కంపెనీ హైడ్రోజన్ పవర్‌గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులపై పని చేస్తున్నారనీ, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఈ సంస్థ వీటిని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, కర్ణాటక రాష్ట్రం చిక్‌బల్లాపూర్ ఎంపీ సుధాకర్ రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఇన్‌చార్జి అంకాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.