Share News

మళ్లీ ఉత్కంఠ..!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:33 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మార్కెట్‌ యార్డు నామినేటెడ్‌ పదవుల ఎంపిక పక్రియకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తెరదించినట్లైంది.

మళ్లీ ఉత్కంఠ..!

మార్కెట్‌యార్డు కమిటీలపై వీడని సస్పెన్స్‌

తాజాగా నంద్యాల, పాణ్యం చైర్మన్ల ప్రకటన

ఆశావహుల్లో మొదలైన అలజడి

తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు

నంద్యాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మార్కెట్‌ యార్డు నామినేటెడ్‌ పదవుల ఎంపిక పక్రియకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తెరదించినట్లైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినప్పటికీ ఆశావకులు ఏమాత్రం నిరూత్సాహం చెందలేదు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్‌ యార్డుల చైర్మన్లను ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో జిల్లాలోని ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. మిగిలిన వారిలో ఆందోళన నెలకొంది. జిల్లాలో 8 మార్కెట్‌ యార్డు కమిటీలు ఉన్నాయి. వాటిలో తాజాగా నంద్యాల కమిటీ చైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్‌ యార్డుకు అంగజాల గీత ఎంపికయ్యారు. మిగిలిన ఆరు కమిటీల ఎంపికపై ప్రభుత్వం ప్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఒత్తిడి పెరగడంతో ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 1:3 ప్రకారం ఆశావహుల లిస్ట్‌ రాజధాని అమరావతికి చేరింది. ఈ నేపథ్యంలో ఎవరికి చైర్మన్‌ పదవి దక్కుతుందోనని ఆయా వర్గాల్లో టెన్షన్‌ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి నెలలు గడుస్తున్న నామినేటెడ్‌ పదవులు భర్తీ తరచూ వాయిదా పడడంతో పోటీ తీవ్రత మరింత పెరిగింది. తాజాగా ప్రభుత్వం నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నాయకుడు గుంటుపల్లి హరిబాబు, పాణ్యం మార్కెట్‌యార్డుచైర్మన్‌గా అంగజాల గీతను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మార్కెట్‌యార్డులకు రాయలసీమ జిల్లాల్లోనే ప్రత్యేక స్థానం ఉంది. దీంతో ఆయా పదవులకు సైతం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో కీలకంగా పనిచేసిన కార్యకర్తలు సైతం పదవులకు పోటీపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు స్థానికంగా లేకపోయినా.. వారు ఎక్కడుంటే అక్కడకు పరుగులు పెడుతున్నారు. చైర్మన్‌ పదవితోపాటు వైస్‌చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులకూ డిమాండ్‌ పెరిగింది.

ప్రజాప్రతినిధుల వెంట నేతలు

ఎవరికైనా నామినేటెడ్‌ పదవి దక్కాలంటే... స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో పాటు సిఫార్సు ఉండాల్సిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా పదవుల ఎంపిక విషయంలో కూడా ఆయా ప్రజాప్రతినిధులు సైతం తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఎక్కడ చూసినా ఆయా పదవుల కోసం ఆశావకుల జాబితా చూస్తే.. ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో పార్టీ కోసం ఎవరెవరు ఎంత మేర కృషి చేశారోనని టీడీపీ పునఃపరిశీలన చేస్తోంది. సామాజిక వర్గాలు, పార్టీకోసం శ్రమించిన తీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

జిల్లాలోని మార్కెట్‌యార్డులు

1) నంద్యాల

2) పాణ్యం

3) ఆళ్లగడ్డ

4) డోన్‌

5) నందికొట్కూరు

6) ఆత్మకూరు

7) బనగానపల్లె

8) కోవెలకుంట్ల

విధేయతకు పట్టం

నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌గా గుంటుపల్లి హరిబాబు

సంబరాల్లో టీడీపీ శ్రేణులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఆదేశాలను జవదాటని నైజం ఉన్న గుంటుపల్లి హరిబాబుకు నంద్యాల మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవి దక్కింది. నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీలో కీలకమైన కార్యకర్త. ఆయన కుమారుడు హరిబాబు 2020లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2023లో రాష్ట్ర రైతువిభాగం ఉపాధ్యక్షుడిగా, 2024లో పార్టీ పరిశీలకుడిగా పనిచేశారు. ప్రస్తుతం హరిబాబు మార్కాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా ప్రకటించడంతో గ్రామంలో రైతునగరం గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పాణ్యం మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా అంగజాల గీత

నంద్యాల ఎడ్యుకేషన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం దుర్వేసి గ్రామానికి చెందిన అంగజాల గీతకు పాణ్యం మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి దక్కింది. రిజర్వేషన్‌ ప్రకారం పాణ్యం మార్కెట్‌యార్డు పదవి బీసీ మహిళకు కేటాయించడంతో నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ భార్య అంగజాల గీతకు ఈ అవకాశం రావడంతో పార్టీ గడివేముల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన పాణ్యం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2025 | 12:33 AM