Share News

నకిలీ హాజరు..!

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:31 PM

వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ముఖ హాజరు గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అభాసుపాలవుతోంది. ప్రభుత్వ వైద్య శాలల్లో పనిచేస్తే వైద్యాధికారులు ఐఫోన్‌ ద్వారా ముఖ హాజరును ట్యాంపరింగ్‌ చేసినట్లు నిర్ధారణ జరిగింది.

నకిలీ హాజరు..!

ముఖ హాజరులో హైటెక్‌ అక్రమాలు

వైద్య సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ ట్యాంపరింగ్‌

ఐఫోన్‌లో తప్పుడు హాజరు... గుర్తించిన ఉన్నతాధికారులు

జిల్లా వ్యాప్తంగా ఏడుగురికి షోకాజ్‌ నోటీసులు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ముఖ హాజరు గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అభాసుపాలవుతోంది. ప్రభుత్వ వైద్య శాలల్లో పనిచేస్తే వైద్యాధికారులు ఐఫోన్‌ ద్వారా ముఖ హాజరును ట్యాంపరింగ్‌ చేసినట్లు నిర్ధారణ జరిగింది. జిల్లాలోని కొన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో, పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్లు స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్టులు కొందరు ఐఫోన్‌ ద్వారా ముఖ హాజరును ట్యాంపరింగ్‌ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఐదు రోజుల క్రితం జిల్లాలోని ఏడుగురు వైద్యసిబ్బంది ఐఫోన్‌తో ట్యాంపరింగ్‌ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసినట్లు గుర్తించారు. ఐఫోన్‌లో ట్యాంపరింగ్‌ చేసి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు రాకుండానే తప్పుడు హాజరును నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారిపై నిఘా ఉంచిన వైద్యశాఖ ఉన్నతాధికారులు కర్నూలు జిల్లాలో ఏడుగురు ఉద్యోగులను గుర్తించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రాథమిక వైద్యశాలల్లో పనిచేసే వైద్యాధికారులు, ఇతర ఉద్యోగులకు ముఖ హాజరు తప్పనిసరి చేసింది. అందుకోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా ముఖ హాజరు వేస్తే సమయం, తేదీ, ఎక్కడ వేశారు అనేది నమోదవుతుంది. ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది. అయితే ఎక్కువమంది వైద్యాధికారులు, సిబ్బంది ఐఫోన్లను వినియోగిస్తున్నారు. ఆ ఫోన్ల ద్వారానే ముఖ హాజరు వేస్తున్నారు.

ఎప్పుడొచ్చినా అదే సమయం..!

వైద్యశాఖలో కొందరు సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు ఎన్ని గంటలకు వెళ్లినా వారి వద్ద ఉన్న ఐఫోన్‌లో సమయం ఏ విధంగా నమోదు చేసుకుని ఉంటారో ఆ విధంగానే ముఖ హాజరు తీసుకుంటుంది. ఉదాహరణకు ఓ ఉద్యోగి ఉదయం 9:30 గంటలకు వైద్యశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఉద్యోగి ఉదయం 11 గంటలకు వెళ్లి ఐఫోన్‌లో టైమింగ్‌ సెట్టింగ్‌ ద్వారా ముఖ హాజరు వేసినా ఉదయం 9:30 గంటలకు హాజరైనట్లు నమోదవుతుంది. ఈ విషయాన్ని వైద్యఆరోగ్యశాఖలో ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసి ప్రస్తుతం ఆ విధంగా ట్యాంపరింగ్‌ చేసిన వైద్యాధికారులు 185 మంది మరో 13వేల మంది పారామెడికల్‌ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ వైద్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఉద్యోగుల్లో ఆందోళన

జిల్లాలోని పలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఐఫోన్‌ ద్వారా ముఖహాజరు ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. నన్నూరు పీహెచ్‌సీలో ఓ స్టాఫ్‌ నర్సు రెండు సార్లు, పత్తికొండలో ఓ డాక్టర్‌ ఒకసారి, ఎర్రబురుజు అర్బన్‌ హెల్త్‌ సెంటరులో ఓ మెడికల్‌ ఆఫీసర్‌, ఓ ఫార్మాసిస్టు గ్రేడ్‌-2, బండిమెట్ట అర్బన్‌ హెల్త్‌ సెంటరులో స్టాఫ్‌ నర్సు ఒక్కోసారి ఐఫోన్‌లో ట్యాంపరింగ్‌ చేసినట్లు గుర్తించారు. పుచ్చకాయమడ పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు 3 సార్లు ఐఫోన్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయడం గమనార్హం. అయితే రాష్ట్ర స్థాయిలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు అక్రమాలను గుర్తించడంతో వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఐఫోన్‌లో ట్యాంపరింగ్‌ చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసిన ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్ల వివరాలు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు, ముగ్గురు స్టాఫ్‌ నర్సుల వివరాలు కడప ఆర్‌డీకి, ఫార్మాసిస్టు వివరాలు డీఎంహెచ్‌ఓకు పంపించారు.

ఏడుగురికి నోటీసులు

వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సిఫార్సుల మేరకు జిల్లాలో తప్పుడు హాజరు నమోదు చేసిన ఏడుగురు వైద్యులు, ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. వారు ఇచ్చిన వివరణను ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ పి.శాంతికళ, డీఎంహెచ్‌ఓ, కర్నూలు

Updated Date - Apr 17 , 2025 | 11:31 PM