వేసవి సెలవులకు ఇంటికి వస్తూ..
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:09 AM
వేసవి సెలవులకని కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పెద్ద హోతూరు సమీపంలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం
కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు
ఆలూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులకని కూతురిని తీసుకొని ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని పెద్ద హోతూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఆస్పరి మండలం మూత్కూరుకి చెందిన ఈరన్న వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
భార్య రాధమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు సంతానం. పెద్ద కూతురు ఇందు తల్లివెంట కూలీ పనికి వెళ్తుంది. రెండో కూతురు శ్రావణి చిప్పగిరి కస్తూర్బా స్కూల్‌లో 9వ తరగతి చదువుతుంది. మంగళవారం శ్రావణిని తీసుకొని స్వగ్రామానికి ఈరన్న బయలుదేరాడు. మండ లంలోని పెద్ద హోతూరు సమీపంలోని గోకుల్ సిమెంట్ మిక్స్ లారీ, బైక్ ఢీకొన్నది. తండ్రీ కూతురు లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. శ్రావణి చదువులో మంచి ప్రతిభ కనబరచేదని ఉపాధ్యాయులు తెలిపారు. ఉదయం అందరికి బైబై చెప్పి వెళ్లిందని ఇంతలో ఇలాంటి మరణ వార్త విద్యార్థులను స్నేహితులను కలచివేసింది
బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరుపాక్షి ఆలూరు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వడ్డే ఈరన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున డిమాండ్ చేశారు.
విలపించిన భార్యాపిల్లలు
తన భర్త, కూతురు ఊరికి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృతి చెందరాని పోలీసుల నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా భార్య రాధమ్మ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. బోరున విలపిస్తూ ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం గదిలో విగతజీవులై పడి ఉండటం చూసి రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.